పాలమూరు: మూసాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టిశేఖర్ ఇటీవల రెవెన్యూ ఉద్యోగితో ఫోన్‌లో మాట్లాడిన తిట్ల దండకం ఆడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారం క్రితం నిజాలాపూర్‌లో సీసీరోడ్లు వేయడానికి ట్రాక్టర్లతో స్థానిక పెద్దవాగు నుంచి ఇసుకను తరలించుకోవడానికి కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ద్వారా అనుమతి పొందారు. 10 ట్రిప్పులకు అనుమతి ఉండటంతో సమయం దాటిపోయిన తర్వాత అదే గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి చందు అక్కడికి వెళ్లి ట్రాక్టర్లను ఆపాడు. గ్రామస్తులు పార్టీ మండల అధ్యక్షుడు శెట్టిశేఖర్‌కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో ఆయన చందుకు ఫోన్ చేసి తిట్టాడు. వాహనాలను ఆపడానికి నువ్వెవరు అంటూ బూతు పురాణం అందుకున్నాడు. అంతటితో ఆగకుండా నౌకరి చేయాలనుకుంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు. ‘తహసీల్దార్ ఆఫీసుకు వచ్చి మీ అందరినీ లోపల వేసి తంతా..’ అంటూ తిట్టిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఘటన జరిగిన మరుసటి రోజు దీనిపై మండల అధికారులు రాజీ చేశారని తెలిసింది. తాజాగా ఆడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తహసీల్దార్ రాజును ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
రెవెన్యూ ఉద్యోగిపై కాంగ్రెస్ నాయకుడి తిట్ల దండకం
సోషల్ మీడియాలో వైరల్