
దేవరకద్ర మార్కెట్‌లో తడిసిన ధాన్యం
దేవరకద్ర/అడ్డాకుల: జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా.. దేవరకద్ర మార్కెట్‌లో ధాన్యం తడిసింది. గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వరి కోతలు ప్రారంభం కావడంతో దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం మార్కెట్ వచ్చింది. మధ్యాహ్నం వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. తూకాలు వేసిన ధాన్యం బస్తాలపై తాట్‌పాల్ కవర్లు కప్పినప్పుటికీ ఆలస్యంగా అమ్మకానికి తెచ్చిన ధాన్యం కుప్పలు మార్కెట్ యార్డు ఆవరణలోనే ఉండడంతో వర్షానికి ధాన్యం తడిపోయింది. నీటిలో కొట్టుకుపోకుండా రైతులు చాలా ప్రయత్నాలు చేశారు. దాదాపు 400 బస్తాల ధాన్యం తడిసిపోయిందని, ఎంతో ఆశతో అమ్ముకుందామని తెస్తే.. వర్షం ముంచేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మూసాపేట మండలంలోని మూసాపేట, జానంపేట, చక్రాపూర్, వేముల, సంకలమద్ది, నిజాలాపూర్, కొమిరెడ్డిపల్లి, దాసర్‌పల్లి, నందిపేట, అడ్డాకుల మండలంలోని శాఖాపూర్, గుడిబండ, పొన్నకల్, రాచాల గ్రామాల్లో వర్షం కురిసింది. సర్వీస్ రోడ్లపై రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోయింది. మహబూబ్‌నగర్ పట్టణంతో పాటు జడ్చర్ల, భూత్పూర్ మండలాల్లో 15 నిమిషాల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.