
పాలమూరులో ముస్లింల భారీ ర్యాలీ
● రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్ సవరణ చట్టం: టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
స్టేషన్ మహబూబ్‌నగర్: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జిల్లాకేంద్రంలో ముస్లింలు సోమవా రం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కాలనీల నుంచి తరలివచ్చిన ముస్లింలు సమూహంగా ఏర్పడి క్లాక్ టవర్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. వేలాది ముస్లింలతో ఈ నిరసన ర్యాలీ అశోక్‌టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించారు. ర్యాలీలో ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చినందుకు నిరసనగా సీఎంలు చంద్రబాబునాయుడు, నితీష్‌కుమార్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్రం వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చిందని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులు అల్లా పేరిట ఉంటాయని, దీంట్లో కేంద్రం ప్రభుత్వం పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ చట్టానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురు ముస్లిం పెద్ద లు, సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ర్యాలీల్లో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కురుమూర్తి, కిల్లె గోపాల్, చంద్రకాంత్, రాజ్‌కుమార్, మోహ న్, వామన్‌కుమార్‌తో పాటు ముస్లిం సంఘాల ప్రతినిధులు మోసీన్‌ఖాన్, తఖీ హుస్సేన్, ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షులు ఫారుఖ్ హుస్సేన్, ఖుద్దూస్‌బేగ్, సిరాజ్‌ఖాద్రీ, మహ్మద్ తఖీ, అజ్మత్‌అలీ, అబ్దుల్ రహెమాన్, షబ్బీర్ అహ్మద్, హాఫిజ్ ఇద్రీస్, ఎండీ ఫయాజ్, ఎండి.అయూబ్, షేక్ ఫరీద్, సిరా జ్‌ఖాన్, నిజాముద్దీన్, అవేజ్ పాల్గొన్నారు.