
క్రీడా శిబిరాలకు సన్నద్ధం
మహబూబ్‌నగర్ క్రీడలు: ఔత్సాహిక క్రీడాకారులకు ప్రతి ఏడాది నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు క్రీడా నైపుణ్యాన్ని చాటేందుకుగా వేదికగా ఉపయోగపడుతున్నాయి. జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో చిన్నారులు, యువత కోసం ప్రత్యేక వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. నెలరోజుల పాటు వేలాది మంది ఔత్సాహిక క్రీడాకారులు శిక్షణ తీసుకుంటారు. ఈ శిబిరాల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతారు.
● ఈ ఏడాది జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడాశిఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 10 వరకు వేసవి క్రీడాశిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. అయితే జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల ఔత్సాహిక క్రీడాకారుల కోసం అర్బన్ కింద దాదాపు 15 వరకు వేసవి క్రీడాశిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు.
దరఖాస్తులను ఆహ్వానించిన యువజన, క్రీడాశాఖ
ఈఏడాది జిల్లాలో నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై జిల్లా యువజన, క్రీడాశాఖ కార్యాచరణ రూపొందిస్తుంది. వివిధ క్రీడాంశాల్లో మే 1వ తేదీ 30 వరకు (నెల రోజుల పాటు) ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ అందజేస్తారు. ఈ మేరకు జిల్లా యువజన, క్రీడాశాఖ జిల్లాలో వేసవి క్రీడా శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ఇటీవల వేసవి క్రీడా శిక్షణ శిబిరాల దరఖాస్తుల కోసం ప్రకటన విడుదల చేశారు. జాతీయస్థాయి సీనియర్ క్రీడాకారులు లేదా వ్యాయామ ఉపాధ్యాయులు (పీడీ, పీఈటీ) వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తుతో పాటు క్రీడల్లో తాము సాధించిన ధ్రువపత్రాలను జిల్లాకేంద్రం మెయిన్ స్టేడియంలోని యువజన, క్రీడా కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా పంపాలి.
వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ఈ ఏడాది వేసవి క్రీడాశిక్షణా శిబిరాల నిర్వహణపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గతేడాది వేసవి శిబిరాల్లో చాలా మంది విద్యార్థులు, ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొన్నారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు సంబంధించి సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను పకడ్బందీగా నిర్వహిస్తాం.
– ఎస్.శ్రీనివాస్, డీవైఎస్‌ఓ
జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలోవేసవి శిబిరాలు
మే 1వ తేదీ నుంచి
నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ
దరఖాస్తులు ఆహ్వానించిన
యువజన, క్రీడాశాఖ

క్రీడా శిబిరాలకు సన్నద్ధం