
మంచిర్యాల: గులాబీ గూటిలో అసంతృప్తి ‘ముళ్లు’ బయటపడుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కడంతో పార్టీలో ఉన్న నాయకులు తమ పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు. గత రెండ్రోజులుగా మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలను కలుస్తున్నారు. ఆదివారం కూడా మంచిర్యాల పట్టణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
తన అనచరులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉన్నారు. గతంలో ఆయనకు ఎమ్మెల్సీ, రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించినా ఎలాంటి పదవీ రాలేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఆయన మద్దతు ఉంటుందనేది కీలకంగా మారనుంది.
ఇటీవల నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహించి టికెట్ ఆశించిన రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంటు కార్పొరేషన్ చైర్మన్ పుస్కూరి రామ్మోహన్‌రావు ఒకింత నిరాశలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన వర్గం ఇప్పటికీ పార్టీలో ఎమ్మెల్యే గ్రూప్‌తో విభేదించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా నాయకులు పార్టీ వీడుతారా..? లేక మళ్లీ పార్టీకి విధేయతను ప్రదర్శిస్తారా..? అనేది తేలాల్సి ఉంది.