మంచిర్యాలఅర్బన్: సుదీర్ఘ కాలం తర్వాత ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5నుంచి సమ్మెకు అద్దె బస్సుల నిర్వాహకుల నిర్ణయంతో బస్సులు నిలిచిపోనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 9న మహలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించడంతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రెట్టింపైంది. 50శాతం నిండని బస్సుల్లో 75శాతం నుంచి 80 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతూ వస్తోంది.
ప్రస్తుతం ఏ బస్సుల్లో చూసినా పరిమితికి మించి 110 నుంచి 120 మంది ప్రయాణం చేస్తున్నారు. నిబంధనల మేరకు పల్లె వెలుగు బస్సుల్లో 56, ఎక్స్‌ప్రెస్‌ల్లో 51మంది ప్రయాణికులకే మాత్రం బీమాను యజమానులు చెల్లిస్తూ వస్తున్నారు. అంతకు మించి ప్రయాణికులు పెరిగినా బీమా వర్తించదని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే నష్టపరిహారం బాధ్యత ఎవరిదనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సులపై అదనపు భారం పడి.. వేగం తగ్గిపోతుందని బస్సుల యజమానులు వాపోతున్నారు. ఈ నెల 5నుంచి ఆర్టీసీలో సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి.
309 బస్సులకు బ్రేక్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 606 బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర వేస్తున్నారు. ఇందులో 303 అద్దె బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆదిలాబాద్‌లో 60, మంచిర్యాలలో 69, నిర్మల్‌లో 77, భైంసాలో 49, ఆసిఫాబాద్‌లో 31, ఉట్నూర్‌లో 23 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఈ లెక్కన సంస్థ పరిధిలో నడిచే బస్సుల్లో సగం అద్దె బస్సులే అన్నమాట. మహలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత బస్సులు సరిపోవడం లేదు. కొన్ని రూట్లలో ఏ బస్సులో చూసినా రద్దీ తగ్గడం లేదు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని కొత్త బస్సులు రావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఆర్టీసీలో అద్దె బస్సులు సగానికి పైగా సమ్మెకు వెళ్తే పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది.
సమ్మె నోటీసు..
తమ డిమాండ్లు పరిష్కరించాలని అద్దెబస్సుల యజమానులు సమ్మెకు దిగుతున్నారు. ఇప్పటికే అద్దె బస్సుల యజమానుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల డిపో మేనేజర్ రవీంద్రనాథ్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉండడంతో ఇబ్బందులు తప్పేలా లేదు. ఆర్టీసీలో సగం బస్సులు అద్దె బస్సులే కావడంతో సమ్మెకు వెళ్తే ఎలా అనేదానిపై చర్చ సాగుతోంది. మొత్తం బస్సులు తిప్పితేనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. అలాంటిది సగం బస్సులు నిలిచిపోతే ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment