రోడ్డెక్కిన పత్తి రైతులు
చెన్నూర్: పత్తి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు మళ్లీ రోడ్డెక్కారు. సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపి వేయడంతో సోమవారం చెన్నూర్‌లోని కాటన్‌మిల్లు ఎదుట మంచిర్యాల–చెన్నూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. జిన్నింగ్ మిల్లుల ఎదుట పెద్దయెత్తున పత్తి వాహనాలు నిలిచిపోయాయి. రెండ్రోజులకోసారి పత్తి కొనుగోళ్లు నిలిపి వేస్తున్నారని, రైతుల ధర్నా చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారంలో రెండ్రోజులు కొనుగోలు చేస్తే ఆరు రోజులు నిలిపి వేస్తున్నారని కోటపల్లికి చెందిన రైతుల మారయ్య, సమ్మయ్య తెలిపారు. ఈ నెల 9నుంచి 20వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేంద్రమంత్రితో మాట్లాడి మూడు రోజుల క్రితం పత్తి కొనుగోళ్లు ప్రారంభింపజేయగా.. మళ్లీ నిలిచిపోయాయి.
అధికారుల సమన్వయ లోపం
చెన్నూర్ మార్కెట్ కమిటీ, సీసీఐ అధికారుల సమన్వయం లోపం రైతులకు ప్రాణసంకటంగా మారింది. గతంలో తప్పుడు టీఆర్ పత్రాల జారీతో చెన్నూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి రామాంజనేయులు సస్పెండైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్ కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్నా మంచిర్యాల డీఎంవో, సీపీవోల మధ్య సమన్వయం లేకరైతులకు పత్తి డబ్బులు సకాలంలో రావడం లేదు. గత నాలుగు రోజులుగా పత్తి అమ్మిన రైతులకు సీసీఐ డబ్బులు చెల్లించేందుకు డీఎంవో ధ్రువీకరించాల్సి ఉంది. డీఎంవో స్పందించడం లేదని సీపీవో పత్తి కొనుగోళ్లు నిలిపి వేసినట్లు తెలిసింది. కలెక్టర్ స్పందించి పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
అధికారుల సమన్వయ లోపం
Comments
Please login to add a commentAdd a comment