లక్సెట్టిపేట(మంచిర్యాల): ప్రమాదవశాత్తు గోదావరిలో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల్లగూడెంకు చెందిన సత్యనారాయణ (44) కాగజ్‌నగర్‌లోని ఎస్సీ వసతిగృహంలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన ఆయన మంగళవారం ఉదయం గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో మృతి చెందాడు. మృతుని భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
నస్పూర్: పట్టణ పరిధిలోని శ్రీరాంపూర్–బెల్లంపల్లి హైవే బైపాస్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సుగుణాకర్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భూపేందర్ సింగ్ (41)రామగుండం ఎన్టీపీసీలోని ఓ కంపెనీలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కారులో గోదావరిఖని వైపు నుంచి మందమర్రి వైపు వెళ్తుండగా సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆల యం సమీపంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వద్ద లభించిన గుర్తింపు కార్డులో ఉన్న వివరాలు సేకరించి సమాచారాన్ని అతని కుటుంబ సభ్యులకు అందించారు. మృత దేహాన్ని మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో భద్రపర్చామని, కుటుంబ సభ్యులు వచ్చాక అప్పగిస్తామన్నారు.
తప్పిన ప్రమాదం
దండేపల్లి: మండలంలోని మేదరిపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ట్రాక్టర్ మంగళవారం ఆటోమేటిక్‌గా స్టార్టయి చెట్టును ఢీకొని ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మల్టీపర్పస్ వర్కర్ ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌లో ఆడుకుంటున్న పిల్లలు క్లచ్‌పై కాలుపెట్టడంతో ఆటోమేటిక్‌గా స్టార్టయిన ట్రాక్టర్ కొంతదూరం వెళ్లి పక్కనున్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పాతమంచిర్యాల: అంగన్‌వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సంఘం (సీఐటీయూ అనుభందం) జిల్లా అధ్యక్షురాలు భానుమతి అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పలుమార్లు మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కోశాధికారి మహేశ్వరి, నాయకురాళ్లు పద్మ, సరిత, అనురాధ, సబిత, తదితరులు పాల్గొన్నారు.
కేకేఓసీలో వోల్వో ఆపరేటర్‌కు గాయాలు
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే ఓసీలోని మట్టితీత పనుల వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో వోల్వో ఆపరేటర్‌కు గాయాలయ్యాయి. ఓసీలోని ఓబీ తొలగింపు వద్ద మట్టితో నింపిన వాహనం ముందుకు వెళ్లే క్రమంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో అక్కడే ఉన్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో అందులో ఉన్న ఆపరేటర్ రాజేశంకు గాయాలయ్యాయి. తోటి ఆపరేటర్లు రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
మహిళపై కోతుల దాడి
బోథ్: మండల కేంద్రానికి చెందిన గంగమ్మపై మంగళవారం కోతులు దాడి చేశాయి. మందగా వచ్చిన కోతులు ఒక్కసారిగా ఆమైపె దాడి చేయడంతో గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బోథ్ సీహెచ్‌సీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment