పక్షుల లెక్క తేలింది
● జన్నారం డివిజన్‌లో 201 రకాలు గుర్తింపు ● అటవీశాఖ, వరల్డ్‌వైడ్ లైఫ్‌ఫండ్ ఆధ్వర్యంలో సర్వే
జన్నారం(ఖానాపూర్): పక్షుల గమనానికి పరిధిలు లేవు. అవి ఖండాలు దాటి ప్రయాణిస్తూ పర్యావరణంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణంలో జరిగే పెను మార్పుల వల్ల కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస వెళ్తుంటాయి. ఇలాంటి పక్షులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్షులు ఎంతో జీవవైవిద్యం ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పక్షుల వివరాలను తెలుసుకునేందుకు అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ ఏడాది జనవరి 24 నుంచి 26 వరకు జంతుగణన మాదిరి కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లో పక్షుల గణన చేశారు. 28 మంది సభ్యులు ఏడు బృందాలుగా ఏర్పడి డివిజన్‌లోని 40 అటవీ బీట్‌లలో సర్వే చేశారు. డివిజన్‌లో సంచరిస్తున్న పక్షుల వివరాలను సేకరించారు. వీటితో పాటుగా అంతరించిపోయే దశలో ఎన్నిరకాల పక్షులు ఉన్నాయి? ఏఏ కేటగిరీలో ఏ పక్షులున్నాయో సర్వేలో తేలినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
201 రకాల పక్షులు
జన్నారం అటవీ డివిజన్‌లో నిర్వహించిన సర్వేలో 201 రకాల పక్షులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖ, వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో పక్షులపై సమగ్ర పరిశీలన చేశారు. 11 రకాల పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయని, 57 రకాల పక్షులు కేవలం అటవీ, ప్లాంటేషన్ ఏరియాలో సంచరిస్తున్నాయని, మన పరిసరాల్లో తిరిగే పక్షులు 18, కీటకాలు తినే పక్షులు 99 రకాలు, కేవలం పండ్లను మాత్రమే తినే పక్షులు 16 రకాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
పక్షులపై అవగాహన
ప్రస్తుత రోజుల్లో పక్షుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థి దశ నుంచే దీనిని ఒక హాబీగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో పక్షులు, వాటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అటవీశాఖ నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే సైన్స్ టీచర్లను అడవుల్లోకి తీసుకెళ్లి బర్డ్‌వాక్ కార్యక్రమం చేపట్టనున్నారు. వీటితో పాటుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థ ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలు పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించనున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. పక్షుల సంరక్షణపై, పక్షులు అంతరిస్తే కలిగే నష్టాలు, జీవ వైవిద్యంలో పక్షుల పాత్ర, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
ప్రతీ ఆర్నెల్లకోసారి..
ప్రతీ ఆర్నెల్లకోసారి పక్షులపై అవగాహన కల్పించే యోచన చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పక్షుల రకాలను గుర్తించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వలంటీర్లగా నియమించాలని యోచిస్తున్నాం. అర్హులైన స్థానికులను నేచర్ గైడ్‌లుగా నియమిస్తాం. – శివ్‌ఆశిష్‌సింగ్,
జిల్లా అటవీశాఖ అధికారి, మంచిర్యాల
పక్షుల లెక్క తేలింది
Comments
Please login to add a commentAdd a comment