జిల్లాకు ఎయిర్‌పోర్ట్ తీసుకొస్తాం
ఆదిలాబాద్: జిల్లాకు ఎయిర్ పోర్ట్ తప్పకుండా తీసుకువస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి మాట్లాడారు. ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ నాయకులు అవగాహన రాహిత్యంతో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న జోగు రామన్న జిల్లా ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏర్పాటు కోసం 2014లో తాను ఎంపీగా ఉన్న సమయంలో కృషి చేశానన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగానే ఎయిర్ పోర్ట్ అకాడమీ పెండింగ్‌లో ఉందన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్‌కు సంబంధించి 2011లోనే సర్వే జరిగిందన్నారు. ఇదే రైల్వే లైనుకు ఆర్మూర్–ఆదిలాబాద్ వయా నిర్మల్ కు జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇద్దరు మంత్రులను కలిసినా పట్టించుకోలేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు వేద వ్యాస్, రఘుపతి, లాలా మున్నా, నగేష్, కృష్ణ, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
● ఎంపీ గోడం నగేష్
Comments
Please login to add a commentAdd a comment