పెరుగుతున్న హాజరు
● ఊపందుకున్న ఉపాధి ● ఉపాధి పనులపై కూలీల ఆసక్తి
కోటపల్లి: గ్రామాల్లో వలసలు నివారించి ఉన్న ఊరిలో ఉపాధి కల్పించేందుకు తీసుకువచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరందుకున్నాయి. జాబ్‌కార్డు కలిగిన కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాలో ఉపాధిహామీ కూలీల హాజరు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతీ పంచాయతీకి సరాసరి 33 మంది పనిచేస్తున్నారు. ఈనెలాఖరు వరకు 50కి పని కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. మొన్నటి వరకు యాసంగి పనులు ఉండటంతో కూలీలు అధికంగా అటువైపు మొగ్గు చూపారు. ఫిబ్రవరి చివరివారంలో జిల్లాలో 8 వేల వరకు కూలీలు పనిచేయగా ప్రస్తుతం 11 వేలకు పైగా హాజరవుతున్నారు. ఇప్పటికి ప్రారంభం కాని పనులు ఉంటే వాటి స్థానంలో ప్రత్యావయ్నాయ పనులు గుర్తించి ఈనెలాఖరు నాటికి పూర్తి చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
పెరిగిన డిమాండ్
రాష్ట్రంలో ఉపాధి పనులు చేసిన భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో గ్రామాల్లో ఉపాధి పనులకు మరింత డిమాండ్ పెరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పనులు ఎప్పుడు ప్రారంభమైతే అప్పుడు వస్తామని కొందరు కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్లను కలిసి కోరుతున్నట్లు పేర్కొన్నారు.
అధికారులదే గుర్తించాల్సిన బాధ్యత
ఏటా మార్చి నుంచి ఉపాధి పనులకు డిమాండ్ ఉంటుంది. ఇప్పటికి వంద రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు మార్చి 31వ తేదీ వరకు పనులకు హాజరవ్వడానికి వీలులేదు. దీంతో ఆయా కుటుంబాలు పనులకు దూరంగా ఉంటున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త వార్షిక ఏడాది ప్రారంభమవుతుంది. అప్పుడు కూలీలందరూ పనులు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. కూలీలు పనిచేయడానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉన్నారు. పనులు గుర్తించి సిద్ధం చేసి పెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
రైతులకు తప్పిన భారం
గతంలో తమ పొలాలకు వెళ్లేందుకు తలా కొంత నగదు జమ చేసుకుని రోడ్లు వేసుకునే వాళ్లు. ప్రస్తుతం ఉపాధి హామీ కింద ఫార్మేషన్ రోడ్లు నిర్మిస్తుండటంతో అన్నదాతలకు ఆర్థికభారం తప్పినట్లయింది.
లక్ష్యాన్ని చేరుకుంటాం
ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం. జాబ్‌కార్డు ఉండి అడిగిన వారందరికీ పనులు కల్పిస్తున్నాం. ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించాం.
– కిషన్, డీఆర్‌డీఏ, మంచిర్యాల
జిల్లాలో హాజరు వివరాలు
తేదీ హాజరైన కూలీలు
ఫిబ్రవరి 28 8295
మార్చి 1 8357
మార్చి 2 9877
మార్చి 3 11035
మార్చి 4 11108
జిల్లా మండలాలు పంచాయతీలు జాబ్‌కార్డులు కూలీలు
ఆదిలాబాద్ 17 468 175747 370082
కుమురంభీం 15 335 129885 277287
నిర్మల్ 18 396 180572 370550
మంచిర్యాల 16 311 121067 255151
Comments
Please login to add a commentAdd a comment