మేము బాగున్నాం..ఆందోళన చెందొద్దు
మలేషియా అక్రమ ఆయుధాల కేసులో ఇరుక్కున్న ఆరుగురు
● అక్కడి జైలులో బాధితులను కలిసిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ● తమవారిని తీసుకురావాలని కుటుంబీకుల వేడుకోలు
ఖానాపూర్: మలేషియాలో అక్రమ ఆయుధాల కేసులో ఇరుక్కుని జైలులో మగ్గుతున్న ఆరుగురు ‘మేము బాగున్నాం..తమ వాళ్లు ఆందోళన చెందవద’ని చెప్పాలని తనతో అన్నారని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్‌నాయక్ తెలిపారు. కడెం మండలం లింగాపూర్, మున్యాల గ్రామాలకు చెందిన ఆరుగురు గతేడాది అక్టోబర్ 28న అక్రమ ఆయుధాల కేసులో జైలుపాలయ్యారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు, బాధితులు తన దృష్టికి తీసుకురాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మలేషియాలోని బాధితులను కలిసి వచ్చానని గల్ఫ్ బాధిత కుటుంబీకులకు వివరించారు. గురువారం ఖానాపూర్‌లోని బీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో జాన్సన్‌నాయక్‌ను గల్ఫ్ బాధిత కుటుంబీకులు కలిసి రోదించారు. మలేషియాలోని మలాక, ఏఎఫ్ మోసా ప్రాంతాల్లోని జైలులో ఉన్నవారు పనిచేసే ప్రాంతంలో అక్రమ ఆయుధాల కేసులో సంబంధం లేకున్నా ఇరుక్కున్నారని అన్నారు. ఎలాగైనా తమ వారిని తీసుకురావాలని కుటుంబీకులు వేడుకున్నారు. మాకు మీరే దిక్కని నిరుపేద కుటుంబాలకు చెందిన తాము, తమ వారిని బయటకు తీసుకువచ్చే మార్గం తెలియక గత ఐదునెలలుగా తడారని కళ్లతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జాన్సన్‌నాయక్ మాట్లాడుతూ మలేషియాలో అక్కడి న్యాయవాదితో కలిసి జైలులో ఉన్నవారిని ములాఖత్ అయినట్లు తెలిపారు. రెండు రోజులు అక్కడే ఉండి కేసు పూర్వపరాలు తెలుసుకోవడంతోపాటు వారిని బయటకు తీసుకువచ్చేలా చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరో 20 రోజుల్లో బయటకు వచ్చేలా న్యాయవాదికి తగు సూచనలు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment