● మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ఏర్పాటు ● సందేహాలు, ఫిర్యాదులకు ప్రత్యేక కాల్ సెంటర్ ● భూ అర్జీలను పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూ వివాదాలను పరిష్కరించేందుకు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలు జారీచేశారు. మండల స్థాయిలోనే ప్రతీ సోమవారం ఉదయం 10.30 నుంచి 2 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తారు. ప్రతీ అర్జీకి ఓ నంబరు కేటాయించి క్షేత్రస్థాయిలో అధికా రులు పరిశీలన చేయాల్సి ఉంటుంది. కనీసం 15 రోజులు, గరిష్టంగా 21 రోజుల్లో సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాల్సి ఉంటుంది. ప్రతీ 15 రోజులకోసారి మండల స్థాయి అర్జీలను డివిజనల్ స్థాయి అధికారులు సమీక్షిస్తారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్‌హెచ్‌వో, డివిజన్‌లో ఆర్డీవో, ఏసీపీ, జిల్లాస్థాయి డీసీపీ, కలెక్టర్ కమిటీల్లో సభ్యులుగా ఉండనున్నారు. అలాగే నివాస ప్రాంతాలు, అనుమతులపై ప్రత్యేక అధికారులుగా పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులు ఉంటారు. దీంతో ఎక్కడైనా తప్పుడు పత్రాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకోనున్నారు. అంతేకాకుండా కమిటీల పనితీరు ఇతర ఫిర్యాదులు, సందేహాలపై ప్రజల కోసం కాల్ సెంటర్ 08736–250106 నంబరు అందుబాటులో ఉంటుంది. కమిటీ అధికారులు అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వం చూపిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అయి తే రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, మున్సిపల్ అధికారులు తమ రోజువారీ విధుల్లోనే తీరిక లేకుండా గడిపేస్తున్నారు. కమిటీ బాధ్యులు భూ సమస్యల పరిష్కారానికి అదనపు సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కమిటీ బాధ్యులతో రెండు రోజుల క్రితమే కమిటీలు ఎలా పని చేయాలనే అంశంపై డీసీపీ, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
తీరని భూ వివాదాలు
జిల్లాలో అనేక చోట్ల భూ తగదాలు కొనసాగుతున్నాయి. భూఆక్రమణలు, హక్కులు, వారసత్వ, కోర్టు, సింగరేణి, రెవెన్యూ, అసైన్డ్, సర్కారు, నివా స జాగాల్లో పలుచోట్ల వివాదాలు ఉన్నాయి. చాలా చోట్ల రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీ రాజ్ అధికారులు పరిష్కరించే అవకాశం ఉన్నా చొరవ చూపడంలేదు. కొందరు కోర్టుల్లోనూ న్యాయ పోరాటం చేస్తున్నారు. అనేక ఏళ్లుగా కేసుల విచారణ సాగుతోంది. ఆయా వర్గాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపించేందుకే కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రతీ సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగానికి భూ వివాదాల అర్జీలే అధికంగా వస్తున్నాయి. సమస్య పరిష్కారం కాకపోగా జాప్యం జరగడంతో మరింత జఠిలమవుతోంది. గతంలోనూ మండల స్థాయిలో భూ వివాదాలు ప రిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చా రు. కానీ క్షేత్రస్థాయిలో పలు అవరోధాల కారణంగా చాలా భూ సమస్యలు అలాగే పేరుకుపోయా యి. దీంతో కొందరు భూతగాదాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సెటిల్మెంట్లు చేస్తూ వసూళ్లకు పాల్ప డుతున్నారు. తాజాగా కలెక్టర్ భూవివాదాల పరి ష్కార కోసం కమిటీలు ఏర్పాటు చేయడంతో ఈ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment