అడవి దివిటీలు
● అడవి రక్షణలో మహిళా అటవీ ఉద్యోగుల కీలకపాత్ర ● పురుషులతో సమానంగా విధుల నిర్వహణ ● మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
జన్నారం: దట్టమైన అడవులు.. క్రూర జంతువుల అరుపులు.. కలప స్మగ్లర్లు.. వన్యప్రాణుల వేటగాళ్లు.. ఇవన్నీ చాలవన్నట్లు పోడు భూముల రక్షణ.. వీటన్నింటి మధ్య విధి నిర్వహణ కత్తిమీద సామే. అయినా అన్నీ దాటుకుంటూ అటవీ శాఖ మహిళా ఉద్యోగులు తామెంటో నిరూపించుకుంటున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ పురుషులతో సమానంగా ధైర్య సాహసాలతో విధులు నిర్వర్తిస్తూ అడవి దివిటీలుగా నిలుస్తున్నారు. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని మంచిర్యాల జిల్లా అటవీశాఖ పరిధిలో 74మంది మహిళా ఉద్యోగులు వివిధ స్థాయిల్లో పని చేస్తున్నారు. జన్నారం అటవీ డివిజన్‌లో ఎనిమిది మంది రేంజ్, డీఆర్వో, బీట్ అధికారులు ఉన్నారు.
24 గంటలు విధుల్లో..
అటవీ శాఖ ఉద్యోగం అంటేనే 24గంటల విధి నిర్వహణ. మహిళా ఉద్యోగులు రాత్రివేళల్లో పని చేస్తారా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ తామేమి తక్కువ కాదని ని రూపిస్తున్నారు. జన్నారంఅటవీ రేంజ్‌లోని జన్నారం, ఇందన్‌పల్లి, తాళ్లపేట అటవీ రేంజ్‌లలో మహిళా ఉద్యోగులు ఉదయమే అడవులకు వెళ్లి వన్యప్రాణుల కదలికలు, పులి పర్యవేక్షణ, స్మగ్లింగ్ తదితర అంశాలను పరిశీలిస్తారు. అధికారుల కళ్లుగప్పి కలప దాటిస్తున్న స్మగ్లర్ల ను పట్టుకోవడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.
రాత్రిళ్లు పెట్రోలింగ్
మహిళా ఉద్యోగులు కలప స్మగ్లింగ్ నిరోధంలో భాగంగా ఒక్కోసారి వారి బీట్ పరిధిలో రాత్రివేళల్లోనూ ధైర్యంగా పెట్రోలింగ్ చేస్తుంటారు. చెక్‌పోస్టు డ్యూటీ, బీట్ పరిధిలో అభివృద్ధి పనులు, నీటి సౌకర్యం, గడ్డిక్షేత్రాల నిర్వహణ, పశువులు బీట్ పరిధిలో తిరగకుండా జాగ్రత్తలు తదితర పనుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
– రాత్రి ఒంటి గంట సమయంలో మీ బీట్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారం ఓ మహిళా ఉద్యోగికి అందింది. వెంటనే బేస్‌క్యాంప్, తోటి సిబ్బందికి సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యుల తోడుతో ఆ ప్రాంతానికి వెళ్లి మంటలను అదపులోకి తెచ్చి ఇంటికి చేరుకున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సమాచారం అందగానే వెళ్లి మంటలు అడవంతా వ్యాపించకుండా బ్లోయర్ల సహాయంతో మంటలు వ్యాపించిన ప్రాంతంలో ఆకులను దూరం చేస్తారు.
అడవి దివిటీలు
Comments
Please login to add a commentAdd a comment