భద్రత.. బాధ్యత..
● షీ టీమ్, సఖీ కేంద్రాల అభయహస్తం
మంచిర్యాలక్రైం: మహిళల భద్రత, రక్షణే ధ్యేయంగా జిల్లాలో షీటీమ్, సఖీ కేంద్రాలు పని చేస్తున్నాయి. పని ప్రదేశాలు, విద్యాసంస్థలు, ఉద్యోగ స్థలాలు, ప్రయాణాల్లో ఎవరైన వేధించినా, ఇబ్బందులకు గురి చేయడం, మాయమాటలతో మోసం చేసిన ఘటనలు చోటు చేసుకున్న వెంటనే డయల్ 100కు సమాచారం అందిస్తే తక్షణమే భద్రత కల్పిస్తున్నాయి. సమస్య ఉన్న చోటుకే వెళ్లి అక్కడే పరిష్కారం చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్, సఖీ కేంద్రాల సేవలపై ప్రత్యేక కథనం.
మహిళలకు అండగా ఉంటాం..
మహిళలు ఎలాంటి సమస్యల్లో ఉన్నా నిర్భయంగా ఫిర్యాదు చేస్తే అండగా ఉంటాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. న్యాయపరమైన సేవలు, వైద్య సేవలు అందిస్తాం. భార్యాభర్తలు, అత్తామామల వేధింపులకు గురైన వారికి అండగా నిలబడతాం. పోలీసుల సహకారంతో మహిళలకు భద్రత, రక్షణ కల్పిస్తాం.
– శ్రీలత, సఖీ సెంటర్ నిర్వాహకురాలు
షీ టీమ్ ఆపరేషన్ డెకాయ్...
మహిళల రక్షణ కోసం పోలీసు శాఖలో 2015అక్టోబర్ 31న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో షీ టీమ్స్ ఏర్పడ్డాయి. ఆపరేషన్ డెకాయ్ పేరుతో కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో షీ టీమ్స్ మఫ్టీలో ఉంటూ స్పై కెమెరాలతో ఘటనలను చిత్రీకరిస్తాయి. అనుమానితులను అదుపులోకి కౌన్సెలింగ్ ఇస్తారు. 2024లో ఎనిమిది రెడ్‌హ్యాండెడ్ కేసుల్లో 21మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10మంది మేజర్లపై కేసులు నమోదు చేశారు. వేధింపులపై 100 డయల్‌కు ఫిర్యాదు చేస్తే మఫ్టీలో నిఘా వేస్తారు. అనుమానితులు, పోకిరీలను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇవ్వడం, కేసు నమోదు చేయడం చేస్తారు. జిల్లాలో 2024 నుంచి ఫిబ్రవరి వరకు 96 హాట్‌స్పాట్‌లను గుర్తించి 1424 సార్లు సందర్శించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు షీ టీమ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
షాడోలా ఉంటూ రక్షణ కల్పిస్తాం..
షీ టీమ్‌కు ఫిర్యాదు చేస్తే షాడోలా ఉంటూ రక్షణ కల్పిస్తాం. సోషల్‌మీడియా, ఆన్‌లైన్ స్నేహితులను నమ్మవద్దు. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఫొటోలు మార్ఫింగ్ చేసి సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతారు. తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే స్పందించవద్దు. సైబర్ నేరాలపై 1930, వేధింపులపై 100డయల్, 6303923700 షీ టీమ్ వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వచ్చు. టోల్ ఫ్రీ నంబర్లు 112, 181, 1090, 1091 ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. – హైమా, షీ టీమ్ ఎస్సై, మంచిర్యాల
భద్రత.. బాధ్యత..
Comments
Please login to add a commentAdd a comment