మంచిర్యాలఅగ్రికల్చర్: భూ సమస్యలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు రెండు నెలల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, సభ్యులతో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, భూ సంబంధిత కేసులు, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యలు, సంక్షేమ ఫలాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నుంచి అట్రాసిటి కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని, ఎందుకు పరిష్కరించడం లేదని డీసీపీ భాస్కర్‌ను ప్రశ్నించారు. మే 30లోపు అట్రాసిటి కేసులు, భూ సంబంధిత కేసులన్నీ ఏప్రిల్ 30లోపు పరిష్కరించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కోసం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భూ సంబంధిత సమస్యల దరఖాస్తులను కనీసం 15రోజులు, గరిష్టంగా 31రోజుల్లోపు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య ఎస్సీ, ఎస్టీ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ అట్రాసిటి కేసుల్లో 60 నుంచి 70శాతం మాత్రమే నిజమైనవి ఉంటున్నాయని తెలిపారు. 2024లో 86 కేసులు కాగా ఇందులో 56 కేసులు కోర్టుకు పంపించామని, 2025లో 21 కేసులు నమోదు కాగా ఒక కేసు చార్జీషీట్ చేశామని, మిగతావి పరిశీలనలో ఉన్నాయని, కొన్ని కోర్టు స్టేలో కొనసాగుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రేణుగుంట్ల ప్రవీణ్, కుస్రం నీలాదేవి, రాంబాబునాయక్, కే.లక్ష్మినారాయణ, జిల్ల శంకర్, జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణ, సింగరేణి కంపెనీ జీఎంలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఎందుకు..?
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కృషి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్
బక్కి వెంకటయ్య
నిల్వ నీడ లేకుండా చేసిండ్రు..
దివ్యాంగులమని కూడా చూడకుండా 30 గజాల్లో నిర్మించుకున్న ఇంటిని కూలగొట్టి అక్రమ కేసులు పెడుతూ పోలీసులు వేధిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని తిలక్‌నగర్‌లో దివ్యాంగులకు స్థలం కేటాయించారు. 90 గజాల స్థలంలో ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై పలుమార్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పోలీసు వేధింపులు ఆగడం లేదు. మాకు న్యాయం చేయాలి.
– దివ్యాంగులు మల్లేష్, సుజాత,
రెండు నెలల్లో కేసులు పరిష్కరించాలి