
కళాకారులకు ఉపాధి కల్పిస్తాం
● టీవీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేశ్
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని కళాకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలంగాణ టీవీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పిక్చర్ టైం థియేటర్లో ఔత్సాహిక కళాకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో యువ దర్శకుడు దండనాయకుల మానస్‌తో కలిసి మాట్లాడారు. జిల్లాలో అనేక ప్రకృతి వనరులు ఉన్నాయని, వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే సినిమా, సీరియల్స్ షూటింగ్‌లకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఇప్పటి వరకు 27 సీరియల్స్, 927 డాక్యుమెంటరీలు నిర్మించినట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 110 మందిని బుల్లితెరకు పరిచయం చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మందికి అవకాశం కల్పిస్తామన్నారు. షూటింగ్ కోసం జిల్లాకు వచ్చే కళాకారులకోసం ప్రత్యేక స్టూడియోలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని సీఎంతో పాటు, సినిమా ఇండస్ట్రీ చైర్మన్ దిల్‌రాజు దృష్టికి తీసుకెళ్లానన్నారు. సమావేశంలో నవజ్యోతి సాంస్కృతిక సారధి అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, సభ్యులు రాధాకృష్ణాచారి, జిల్లాలోని కళాకారులు పాల్గొన్నారు.