
గ్రూప్–1లో మనోళ్ల సత్తా
● జనరల్ ర్యాంకింగ్స్ జాబితాలో పలువురు.. ● ఈ ర్యాంకుల ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ● ఎంపికై నవారికి వ్యక్తిగతంగా సమాచారం
తెలంగాణలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో ప్రొవిజనల్ మార్కులు, జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసింది. ఏడు పేపర్ల మార్కులు, జనరల్ ర్యాంకింగ్స్‌తో కూడిన జాబితాను వెబ్‌సైట్‌లో ప్రకటించారు. మార్కుల మెమోలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 సాయంత్రం 5 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఓటీపీతో లాగిన్ చేసి మెమోలను పొందాలి. ఈ ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. ఎంపికై నవారికి వ్యక్తిగతంగా సమాచారం అందజేస్తారని, అందుకోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు యువకులు ర్యాంకులు సాధించారు. ఇందులో ఇప్పటికే కొందరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఉత్తమ ర్యాంక్‌లు సాధించడం గమనార్హం.
డీఎస్పీగా ఎంపికై న మహేందర్
బాసర: మండలంలోని కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన కరండే మహేందర్ గ్రూప్–1లో 471 మార్కులతో జనరల్ ర్యాంక్ 219 సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాడు. ఉజ్వల–సంజీవ్ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు మహేందర్ చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తూ, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవాడు. 2017లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా, 2020లో సివిల్ ఎస్సైగా ఎంపికై సాధించాడు. నేరడిగొండలో ఎస్సైగా, నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం పరిధిలోని రుద్రూర్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం గుడిహత్నూర్ ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపికవడంపై స్వగ్రామంలో ప్రజలు అభినందనలు తెలిపారు. గురువులు నేర్పిన పాఠాలే నాకు ఆదర్శమని, అమ్మానాన్నల కష్టం వృథా కాకుండా పోలీసు ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉందని మహేందర్ తెలిపాడు.