
‘పది’ మూల్యాంకనం
● 7నుంచి 15వరకు జవాబు పత్రాల దిద్దుబాటు ● కొనసాగుతున్న కోడింగ్
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ చర్యలు వేగవంతం చేస్తోంది. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుండగా పదో తరగతి జవాబు పత్రాల మూ ల్యాంకనానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాల్లో 9,198 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గురువారం నాటితో ఒకేషనల్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 7నుంచి 15 వరకు స్థానిక కార్మెల్ హైస్కూల్‌లో జవాబు పత్రాల మూల్యాంక నం చేయనున్నారు. మధ్యాహ్నం గంటపాటు భోజ న విరామం మినహాయిస్తే ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు ఉ దయం 8గంటలకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని డీఈవో యాదయ్య తెలిపారు.
1.34లక్షల జవాబు పత్రాలు
ఇతర జిల్లాల నుంచి పరీక్షలకు సంబంధించిన 1.34 లక్షల పేపర్లకు గాను 1.20లక్షల జవాబు పత్రాలు జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రానికి చేరాయి. ఇంకా 14వేల జవాబు పత్రాలు రావాల్సి ఉంది. ఇప్పటికే పటిష్టమైన భద్రత మధ్య ఏడు సబ్జెక్టుల్లో ఐదు సబ్జెక్టులకు సంబంధించిన కోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతికరసాయన శాస్త్రం, జీవశాస్త్రం కోడింగ్ ప్రక్రియ పూర్తి కాగా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన జవాబు పత్రాలకు కోడింగ్ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. డీఈవో యాద య్య శిబిరం అధికారిగా, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ దామోదర్‌రావుతోపాటు మరో ఇద్దరు ఎంఈవోలు సహాయ క్యాంపు అధికారులుగా వ్యవహరిస్తారు. పేపర్ కోడింగ్ అధికారులుగా ఏడుగురు, చీఫ్ కోడింగ్ అధికారితోపాటు సహాయకులు ఆరుగురు ఉంటారు. అసిస్టెంట్ ఎగ్జామినర్(ఏఈ)లుగా 426మందిని నియమించారు. చీఫ్ ఎగ్జామినర్‌లుగా 71 మంది, ప్రత్యేక సహాయకులుగా 150 మంది ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించా రు. పోలీస్ బందోబస్తు మధ్య సమాధాన పత్రాలు స్ట్రాంగ్‌లో రూమ్‌లో భద్రపరిచారు.