
నేటి నుంచి యుడైస్ ప్లస్‌పై సర్వే
మంచిర్యాలఅర్బన్: యుడైస్ ప్లస్‌లో నమోదు చేసిన మేరకు పాఠశాలల్లో విద్యార్థులున్నారా..? ఎక్కువ మందిని అంకెల్లో చూపుతున్నారా..? అనే అంశాలపై మంగళవారం నుంచి సర్వే కొనసాగనుంది. ఈ నెల 21 వరకు 708 పాఠశాలల్లో డీఈడీ, బీఈడీ విద్యార్థులు 70 మంది క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఒక్కో విద్యార్థి రోజుకు రెండు చొప్పున 10 పాఠశాలలను క్షేత్రస్థాయి తనిఖీ చేస్తారు. పాఠశాలల్లోని వాస్తవ పరిస్థితుల వివరాలన్ని యుడైఎస్‌లో ప్రధానోపాధ్యాయులు నమో దు చేశారా..? విద్యార్థుల సంఖ్య, సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయనేది రిపోర్టులో నమోదు చేసిన వివరాల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేసి ధ్రువీకరిస్తారు. తప్పులుంటే సరిచేయాలని హెచ్‌ఎంలకు రిమార్క్ రాసి ఇవ్వనున్నారు. యుడైఎస్‌లో నమోదు చేసే వివరాల ఆధారంగా పాఠశాలలకు బడ్జెట్ కేటాయిస్తుంటారు. స్థానిక ఎస్‌ఆర్‌కేఎం డైట్ కళాశాలలో సోమవారం యుడైఎస్ ప్లస్ సర్వే నిర్వహణపై మంచిర్యాల ఎస్‌ఆర్‌కేఎం డైట్ కళాశాల నుంచి 40 మంది విద్యార్థులు, కుమురంభీం ఆసిఫాబాద్ డైట్ కళాశాల నుంచి 30 విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. పలు అంశాలపై నిర్వహించే సర్వేపై సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, ఏఎస్‌సీ రాజ్‌కుమార్ శిక్షణ ఇచ్చారు.