
పోలీసులమని చెప్పి చైన్ అపహరణ
లక్ష్మణచాంద: పోలీసులమనిచెప్పి వాహనాన్ని ఆపి మహిళ బంగారు గొలుసు అపహరించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వడ్యాల్ గ్రామానికి చెందిన ఇప్ప (కొత్తూర్)రామవ్వ ఆదివారం మధ్యాహ్నం తమ బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు తమ ఇంటిపక్కనున్న భీమేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్ బయలుదేరింది. కనకాపూర్ జాతీయ రహదారిపై ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి బైకును ఆపారు. ముందు హత్య జరిగిందని, అటువైపు వెళ్లడం సరికాదని మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి లోపల పెట్టుకోవాలని సూచించారు. దీంతో సదరు మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసు తీసి తన పర్స్‌లో పెట్టుకునే క్రమంలో తాము పెట్టి ఇస్తామని చెప్పి తీసుకుని మళ్లీ పర్సు ఇచ్చారు. అనంతరం వారు అక్కడి నుండి జారుకున్నారు. మహిళ పర్సు తీసి చూడగా అందులో చైన్‌కు బదులు రాళ్లు కనిపించడంతో లబోదిబోమంది. రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు.
జాతీయ రహదారి పరిశీలన
కనకాపూర్ జాతీయ రహదారిని నిర్మల్ ఏఎస్పీలు రాజేశ్‌మీనా, ఉపేందర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. మండలంలోని వడ్యాల్ గ్రామానికి చెందిన కొత్తూరు రామవ్వ నిర్మల్‌లో తమ బంధువుల పెళ్లి ఉండగా తన ఇంటి పక్కనున్న వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. ఈ క్రమంలో కనకాపూర్ జాతీయ రహదారిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి ఆమె వద్ద ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీలు ఘటనా స్థలాన్ని పరిశీలించి రామవ్వ ద్వారా వివరాలు సేకరించారు. ఘటనపై వేగంగా విచారణ చేపట్టాలని ఎస్సై మాలిక్ రెహమాన్‌ను ఆదేశించారు.