
42కిలోలైతే ఓకే..!
● ధాన్యం దించుకునేందుకు మిల్లర్ల మెలిక ● కొనుగోలు కేంద్రాల్లో మొదలైన దోపిడీ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ మొదలైంది. ధాన్యం సరిగా లేదని, తేమ సాకు చూపి బస్తాకు 42కిలోల చొప్పున తూకం వేస్తూ రైతులను ముంచేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభం కాగా, కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు 11మిల్లులకు ట్యాగింగ్ ఇవ్వగా.. సుమారు 9వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు జరిగాయి. క్రమంగా కేంద్రాలకు ధాన్యం రావడం పెరుగుతుండడంతో మిల్లర్లు మెలిక పెడుతున్నారు. తూకంలో అధికంగా బరువు వేయొద్దని మిల్లర్లకు ముందే చెబుతున్నా ధాన్యం దించుకోబోమని రైతులతోనే చెబుతుండడంతో కేంద్రాల నిర్వాహకులు 42కిలోలు జోకుతున్నారు. నిబంధనల ప్రకారం 40కిలోలు తూకం వేయాలి. గన్నీ సంచితో మరో 500గ్రాములు కలిపి, మరో అర కిలో తరుగు చేర్చినా, మొత్తంగా 41కిలోలకు పరిమితం కావాలి. అయితే శుక్రవారం జన్నారం మండలంలో ఐకేపీ కేంద్రంలో 42కిలోలు, ప్రాథమిక సహకార సంఘం పరిధి కేంద్రంలో 41కిలోలు, దండేపల్లిలో 42కిలోల చొప్పున తూకం వేశారు. దీంతో రైతులు రైతులు గత్యంతరం లేక అమ్మేసుకుంటున్నారు. జన్నారం మండలం రేండ్లగూడకు చెందిన ఓ రైతుకు తూకంలో అనుమానం వచ్చింది. దీంతో వేరే చోట బరువు చూస్తే బస్తాకు 42కిలోలు రావడంతో ఆయన కొనుగోలు నిలిపివేశాడు.
తేమ, శుభ్రత లేవనే సాకు
ఏటా ప్రతీ సీజన్‌లో మిల్లర్లు తేమ, శుభ్రత సాకుతో రైతులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. నిబంధనల ప్రకారం 17శాతం లోపే తేమ ఉంటే మద్దతు ధర చెల్లించాలి. చాలా చోట్ల తేమ ఎక్కువగా ఉంటోంది. ఇక ధాన్యం శుభ్రం చేసే యంత్రాల(ప్యాడీ క్లీనర్లు)తో ధాన్యం శుభ్రం చేసుకునేందుకు చాలామంది రైతులు ముందుకు రావడం లేదు. కేంద్రానికి వెళ్లిన వెంటనే అమ్మేసుకోవాలనే వాతావరణ భయంతో, రైతుల తొందరపాటు మిల్లర్లకు కలిసి వస్తోంది. ఇందుకు నిర్వాహకులు సైతం సహకరిస్తూ ఆ మేరకు ట్రక్ షీట్లు, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో రైతులకు నష్టం జరుగుతోంది. జిల్లాలో 321 కేంద్రాల్లో 3.31లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఉంది. ఇందులో ఒక కిలో చొప్పున రైతుల నుంచి కోత పెట్టినా రూ.కోట్లలోనే జిల్లా వ్యాప్తంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. గతంలో చాలా కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టినా కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోగా, ఇంకా ఈ సీజన్‌లోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు.
41కిలోలే తూకం
జిల్లాలో ఐకేపీ కేంద్రాల్లో ఎక్కడా 42కిలోలు తూకం వేయడం లేదు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆ మేరకే తూకం వేయాలని ఆదేశాలిచ్చాం.
– కిషన్ జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి

42కిలోలైతే ఓకే..!