
అధికారులపైనే జాతర భారం!
జాడ లేని ఆలయ పాలకవర్గం
● 26 నుంచి ఏడుపాయల జాతర ● ఎన్నికల కోడ్‌తో ఉత్సవ కమిటీ అనుమానమే ● 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
ఏడుపాయల జాతర సమీపిస్తున్నా ఆలయ పాలకమండలి జాడ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కనీసం ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటయ్యే అవకాశం కన్పించడం లేదు. దీంతో సుమారు 15 లక్షల భక్తులు వచ్చే జాతర ఏర్పాట్లు కేవలం అధికారుల పైనే ఆధారపడనున్నాయి. గత పాలకవర్గం పదవీ కాలం ముగిసి 8 నెలలు కావొస్తున్నా, కొత్త పాలకవర్గం కొలువు దీరకపోవడంతో అటు పార్టీలోని ఆశావహులు.. ఇటు భక్తులు నిరాశకు లోనవుతున్నారు.
పాపన్నపేట(మెదక్): మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే ఏడుపాయల జాతర మూడు రోజుల పాటు జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల భక్తులు వనదుర్గమ్మను దర్శించుకుంటారు. పెద్దజాతర కావడంతో స్థానిక పరిస్థితులు తెలసిన పాలకమండలి ఉంటే జాతర నిర్వహణ నిరాటంకంగా కొనసాగుతుంది. గత పాలకమండలి పదవీ కాలం 2024 ఆగస్టు 6న ముగిసింది. అనంతరం నూతనపాలక మండలి ఏర్పాటు కోసం అదే ఏడాది నవంబర్ 17న నోటిఫికేషన్ వేశారు. 20 రోజుల్లో ఆసక్తి గల వారు కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే సాధారణంగా రాష్ట్రంలోని అధికార పార్టీ, స్థానిక ఎమ్మెల్యే సిఫారసు మేరకు పాలకమండలిని నియమిస్తారు. ఎమ్మెల్యే పాలకవర్గ ఏర్పాటు కోసం కొంత ఆసక్తి చూపారు. ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థులను ఖరారు చేయాల్సిందిగా స్థానిక కాంగ్రెస్ నాయకులకు చెప్పారు. కాని ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో నోటిఫికేషన్ కాలపరిమితి ముగిసిపోయింది. చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకున్న వారు నిరాశలో మునిగారు. సుమారు 10 మంది నాయకులు చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు.
ఏర్పాట్లపై కలెక్టర్ దిశానిర్దేశం
లక్షల మంది భక్తులు వచ్చే జాతర విజయవంతం కావాలంటే పాలకమండలి ప్రాతినిధ్యం అవసరం. స్థానిక పరిస్థితులు, సమస్యలు, జాతర ప్రాశస్థ్యం, తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని, అధికారులు, స్థానికుల సహకారంతో జాతరను విజయవంతం చేస్తారు. గతంలో ఎప్పుడైనా పాలకవర్గం లేకుంటే, ఉత్సవ కమిటీ వేసేవారు. కానీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఉత్సవ కమిటీ ఏర్పాటుకు కూడా అవకాశం లేదని అధికారవర్గాలు అంటున్నాయి. ఇక్కడ ఉన్న ఈఓ చంద్రశేఖర్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తూ ఏడుపాయల ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో జాతర నిర్వహించిన అనుభవం కూడా లేదు. సీనియర్ ఉద్యోగులు కూడా కొంత మంది బదిలీపై వెళ్లగా, మరికొంత మంది పదవీ విరమణ చేశారు. అయితే జాతర నిర్వహణ, ఏర్పాట్లపై ఈనెల 6వ తేదీన కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులతో సమావేశమై దిశానిర్ధేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment