
● వేగంగా పడిపోతున్న భూగర్భజలాలు ● ఒకే నెలలో మీటర్ లోతు
ఎండలు ముదురుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. మరో పక్క భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో జిల్లాలో 9.95 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం, జనవరి చివరి వారానికి వచ్చే సరికి 10.94 మీటర్లకు పడిపోయాయి. ఈలెక్కన కేవలం నెల వ్యవధిలో 1.01 మీటర్ లోతుకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.
మెదక్‌జోన్: జిల్లాలో చెప్పుకోదగిన సాగు నీటి ప్రాజెక్టులు లేవు. ఏకై క మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ ఉంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి మూడు, నాలుగు విడతలుగా నీటిని వదిలితేనే దాని ఆయకట్టు పరిధిలోని 25 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. అయితే జిల్లాలో 95 శాతం మంది రైతులు బోరుబావుల ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1.20 లక్షల బోరుబావులు ఉండగా.. వీటి పరిధిలో 2.90 లక్షల ఎకరాల్లో వరి సాగువుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తికాగా, ఈ నెలాఖరుకు మరో 40 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా కరెంట్ ఉన్నంత సేపు బోరు మోటార్లు నడుస్తూనే ఉంటాయి. భూమిలో ఉన్న చుక్కచుక్కను ఎత్తి పోస్తాయి. దీంతో రానున్న రోజుల్లో మరింత వేగంగా భూగర్భజలాలు పడిపోయే ప్రమాదం ఉంది.
పిల్లికొటాల్‌లో ౖపైపెనే..
జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న పిల్లికొటాల్ సమీపంలో కేవలం 3.67 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. ఇందుకు కారణం ఎంఎన్ కెనాల్ ప్రవహించటం, గ్రామానికి అతి సమీపంలో బొల్లారం మత్తడి ఉండటమే కారణం. రెండో స్థానంలో హవేళిఘనాపూర్‌లో 4.12 మీటర్లు, మూడో స్థానంలో వెల్దుర్తి మండలం కుకునూర్‌లో 5.67 మీటర్లలోతులో భూగర్భజలాలు ఉన్నాయి.
జలం.. పాతాళం!
నీటిని పొదుపుగా వాడుకోవాలి
జిల్లాలో గత డిసెంబర్ నుంచి జనవరి మాసానికి వచ్చే సరికి మీటర్ లోతులోకి భూగర్భజలాలు పడిపోయాయి. ఎండలు ముదిరితే మరింతగా పడిపోయే ప్రమాదం ఉంది. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి. అవసరం మేరకే వినియోగించుకోవాలి. అలాగే గ్రామాల్లో పంపుసెట్లు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. దీంతో నీరు వృథా అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పర్యవేక్షించాలి.
– లావణ్య, గ్రౌండ్ వాటర్ ఫీల్డ్ ఆఫీసర్
అట్టడుగున కొల్చారం..
ప్రస్తుతం జిల్లాలో 10.94 మీటర్లు లోతులోకి నీటి మట్టం పడిపోగా.. కొల్చారం మండలంలో మాత్రం 19.64 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం అత్యధికంగా బోరుబావులు ఉండటం, చెరువులు కుంటలు చెప్పుకోదగ్గ లేకపోవటమేనని తెలుస్తోంది. ఏటా కొల్చారం మండలంలో భూగర్భజలాలు వేగంగా పడిపోతుంటాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment