
4
అండర్‌పాస్‌లు
● అటవీశాఖ నిర్ణయం ● వన్యప్రాణులు ఎక్కువగాసంచరించే ప్రాంతాల గుర్తింపు ● త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలు
అటవీ ప్రాంతంలోని ఎన్‌హెచ్‌లపై నిర్మాణం
రామాయంపేట(మెదక్): ఇటీవల రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై చిరుత మృతి చెందిన ఘటన తర్వాత అటవీ శాఖ మేల్కొంది. అటవీప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారులపై వన్యప్రాణుల సంరక్షణకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని రెండు జాతీయ రహదార్లపై అండర్‌పాస్‌లు నిర్మించాలని నిర్ణయించింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎంపిక చేసిన స్థలాల్లో వాటిని నిర్మించనున్నారు. ఇప్పటికే వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర అటవీశాఖ, రోడ్డు, భవనాల శాఖ, స్థానిక అటవీ అధికారులు రామాయంపేట, మెదక్ మధ్య అటవీప్రాంతంలో సర్వే నిర్వహించారు. ఎక్కడికక్కడ అండర్‌పాసులు నిర్మించాలనే విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ ప్రతిపాదనలను త్వరలో కేంద్రానికి పంపించనున్నారు.
రెండు జాతీయ రహదార్లపై...
జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారి తూప్రాన్, చేగుంట, రామాయంపేట మండలాల మీదుగా వెళ్తుంది. మెదక్ నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట వరకు మరో నూతన జాతీయ రహదారి (765డీజీ)ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి 44పై మూడు కిలోమీటర్లు, మరో రహదారి 765 డీజీపై మెదక్–రామాయంపేట మధ్య నాలుగున్నర కిలోమీటర్ల మేర అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ మేరకు రామాయంపేట–మెదక్ మధ్య అక్కన్నపేట, తొనిగండ్ల, పాతూర్, నార్సింగి మండల పరిధిలోని వల్లూర్ ప్లాంటేషన్ వద్ద రహదార్లపై అండర్‌పాస్‌లను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు.
వన్యప్రాణుల సంరక్షణకే
జాతీయ రహదార్లపై అటవీ ప్రాంతాల వద్ద వన్యప్రాణులు రోడ్డును దాటే క్రమంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. చిరుత మృతి ఘటనలు పునరావృతం కాకుండా అండర్‌పాసుల నిర్మాణానికిగాను ప్రయత్నిస్తున్నాం.
– జోజి, జిల్లా అటవీ అధికారి

4

4
Comments
Please login to add a commentAdd a comment