
మమ్మల్నే కొనసాగించండి
స్థానిక సంస్థల
ఎన్నికల నేపథ్యంలో...
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని రోజుల్లోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డీసీసీబీ, పీఏసీఎస్‌ల పాలకవర్గం పదవీకాలం విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లుగా ఉన్న నాయకులు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో తమను కొనసాగిస్తే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చేస్తామనే అభిప్రాయాన్ని పీఏసీఎస్‌ల చైర్మన్లు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం త్వరలోనే రానుందని సహకార వర్గాలు పేర్కొంటున్నాయి.
● పదవులు కాపాడుకునేందుకు డీసీసీబీ చైర్మన్ల ముమ్మర యత్నాలు
● అనధికారికంగా పాలకవర్గాల భేటీలు
● పీఏసీఎస్ చైర్మన్ల సంతకాలతో తీర్మానాలు
● మంత్రి తుమ్మలను కలిసిన 8 జిల్లాల డీసీసీబీల చైర్మన్లు
● ‘స్థానిక’ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు)ల పాలకవర్గాల పదవీకాలం రెండో రోజుల్లో ముగియనుంది. దీంతో తమ పదవులను కాపాడుకునేందుకు ఆయా డీసీసీబీ చైర్మన్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసిన ఎనిమిది ఉమ్మడి జిల్లాల డీసీసీబీల చైర్మన్లు... తమ పదవీకాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా బుధవారం పలు జిల్లాలో డీసీసీబీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనాలపేరుతో సమావేశాలు నిర్వహించాయి. తమ పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ అనధికారిక తీర్మానాలు చేశాయి. ఈ తీర్మానాలపై ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఉన్న అన్ని పీఏసీఎస్ (ప్రాథమిక సహకార సంఘాల) చైర్మన్లతో సంతకాల సేకరణ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో డీసీసీబీ పాలకవర్గం సర్వసభ్య సమావేశాలు నిర్వహించేందుకు వీలు లేదు. దీంతో అనధికారికంగా సమావేశాన్ని నిర్వహించి ఈ మేరకు తీర్మానాలు చేశారు. డీసీసీబీలతోపాటు, పీఏసీఎస్‌ల పాలకవర్గం పదవీకాలం ఈనెల 15తో ముగుస్తున్న విషయం విదితమే.
మేమంతా కాంగ్రెస్ వాళ్లమే...
ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్రంలో మొత్తం తొమ్మిది (హైదరాబాద్ మినహా) డీసీసీబీలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డీసీసీబీల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఈ తొమ్మిది డీసీసీబీ చైర్మన్లలో ఎనిమిది డీసీసీబీల చైర్మన్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఒక్క కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ రవీందర్‌రావు మాత్రమే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న రవీందర్‌రావును కొన్ని నెలల క్రితం టెస్కాబ్ చైర్మన్ పదవి నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించిన విషయం విదితమే. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఈ ఎనిమిది డీసీసీబీ చైర్మన్లు తామంతా తమ పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళతానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చినట్లు డీసీసీబీ చైర్మన్లు చెబుతున్నారు.
మమ్మల్ని కూడా కొనసాగించండి..
పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)ల పాలకవర్గాల పదవీకాలం కూడా ఈనెల 15తోనే ముగుస్తుంది. దీంతో తమ పదవీకాలాన్ని కూడా కొనసాగించాలని ఆయా పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు కోరుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 920 పీఏసీఎస్‌లు ఉండగా.. బీఆర్‌ఎస్ సర్కారు హాయాంలో తొంభై శాతం పీఏసీఎస్‌ల చైర్మన్లు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న చైర్మన్ల సంఖ్య సుమారు 585 చేరినట్లు అనధికారిక అంచనా. దీంతో తాము కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నామని తమ పదవీకాలాన్ని కూడా కొనసాగించాలని పీఏసీఎస్ చైర్మన్లు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment