● మండుటెండల్లో పరవళ్లుతొక్కుతున్న చెక్‌డ్యాంలు ● 50 వేల
కాళేశ్వరం జలాలతో హల్దీ ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. మండుటెండల్లోనూ చెక్‌డ్యాంలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో సుమారు 50 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. వేసవిలో సాగు నీటికి ఎలాంటి దిగులు లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్‌జోన్: జిల్లాలోని తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి, చిన్నశంకరంపేట, కొల్చారం, మెదక్, హవేళిఘణాపూర్ మండలాల పరిధిలో సుమారు 60 కిలోమీటర్ల పొడవునా హల్దీ ప్రాజెక్టు పారుతుంది. దీనిపై గత ప్రభుత్వ హయాంలో 12 చెక్ డ్యాంలు నిర్మించారు. గోదావరి జలాలను కాళేశ్వరం నుంచి వయా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ ద్వారా గత రెండేళ్లుగా హల్దీలోకి వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు పరిధిలో సుమారు 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అలాగే ప్రాజెక్టు నుంచి ఎటూ మూడు కిలోమీటర్ల మేర భూగర్భజలాలు పెరిగి అడుగంటిన బోర్లలో సైతం నీరు పుష్కలంగా వస్తాయని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
ఏటా రెండు పంటలు..
కాళేశ్వరం నీటితో హల్దీ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఏడు మండలాల పరిధిలోని రైతులు ప్రాజెక్టులో మోటార్లు బిగించి 2 నుంచి 3 కిలో మీటర్ల పొడవునా పైపులైన్లు వేసుకున్నారు. ప్రస్తుతం బోరుబావి తవ్వాలంటే కనీసం రూ. 2 నుంచి రూ. 2.50 లక్షల ఖర్చు అవుతుంది. అదే కిలోమీటర్ మేర పైపులైన్ వేయాలంటే రూ. 50 వేలు మాత్రమే అవుతుండడంతో రైతులు దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వేసవిలో ఒక్కసారి కాళేశ్వరం జలాలు హల్దీలోకి వదిలితే వానాకాలం వచ్చే వరకు నీరు ఉంటుంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాల రైతులు ఏటా రెండు పంటలు వరి సాగు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 2.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా.. ప్రాజెక్టు పరిధిలో 50 వేల ఎకరాలు సాగవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment