
ఎమ్మెల్సీ బరి.. పార్టీల గురి
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ ● ప్రచారం జోరు పెంచిన అభ్యర్థులు ● పట్టభద్రుల ఎమ్మెల్సీకి 56, ఉపాధ్యాయకు 15 మంది పోటీ
ఉదయం, సాయంత్రం ప్రచారం
పాఠశాలలో తరగతులు కొనసాగుతున్న సమయాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని ఎన్నికల సంఘం నిబంధన పెట్టింది. దీంతో అభ్యర్థులు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఉపాధ్యాయ ఓటర్లను కలిసి తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు సమ్మేళనాలు నిర్వహిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. మేనిఫెస్టోలు సైతం ప్రకటిస్తున్నారు. సాయంత్రం గెట్ టు గెదర్ నిర్విహిహంచి దావత్‌లతో మచ్చిక చేసుకుంటున్నారు.
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుండటం.. ప్రచారానికి మరో 10 రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 15 మంది పోటీ చేస్తున్నారు.
సాక్షి, సిద్దిపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్‌రెడ్డి, బహుజన సమాజ్ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా యాదగిరి శేఖర్‌రావు, దేవునూరి రవీందర్‌తో పాటు మరో 51 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్‌టీయూ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మద్దతుతో జగ్గు మల్లారెడ్డితో పాటు 11 మంది బరిలో నిలిచారు. శనివారం హుస్నాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ పాల్గొన్నారు. సిద్దిపేటలో బీజేపీ నాయకులతో ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ సమావేశం నిర్వహించి ప్రచారం తీరును అడిగి తెలుసుకున్నారు.
25 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జి
బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా ఇన్‌చార్జిలను ప్రకటించింది. టీచర్స్ ఎమ్మెల్సీకి రంగారెడ్డి అర్బన్ అధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన నాయకుడు బాణాల లక్ష్మారెడ్డిని నియమించింది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించింది. స్థానిక నాయకులకు 25 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించారు. ప్రతి ఓటరును నాలుగు సార్లు కలిసి పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చే బాధ్యత వీరిదే. కాంగ్రెస్ పార్టీ ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని, నియోజకర్గ వారీగా ఇన్‌చార్జిలను నియమించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ మహేందర్‌రెడ్డి సైతం పీఆర్‌టీయూ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. గత ఆరు నెలల నుంచే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు పలు సంఘాలు మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment