హాల్టింగ్ ఎప్పుడో!
మిర్జాపల్లిలో ఆగని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ● ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఎప్పుడు కల్పిస్తారోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పటి రైల్వే జీఎం సికింద్రాబాద్– నిజామాబాద్ రైల్వే మార్గంలో ప్రయాణించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ విషయమై స్పష్టత వస్తుందని ప్రజలు భావించారు. వినతిపత్రాలు స్వీకరించారే గాని ఎటువంటి హామీ ఇవ్వకపోవటంతో నిరుత్సాహానికి గురయ్యారు. నేటికీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మిర్జాపల్లిలో ఆగకుండా పరుగులు తీస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మెదక్ ఎంపీ రఘునందన్‌రావును కలిసిన బీజేపీ నాయకులు అజంతా ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్‌కు సహకరించాలని వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ను కలిసి విన్నవించారు. గతంలో అజంతా, జైపూర్, అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సికింద్రాబాద్– నిజామాబాద్ మార్గంలో బొల్లారం, మిర్జాపల్లి, కామారెడ్డి రైల్వేస్టేషన్లలో మాత్రమే హాల్టింగ్ ఉండేవి. ఉద్యోగస్తులు, పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు వినియోగించుకునేవారు. ప్రస్తుతం ఈ రైళ్లు మిర్జాపల్లిలో ఆగడం లేదు. మరోవైపు కొత్తగా వచ్చిన రాయలసీమ, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు మరికొన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఈ రైల్వేస్టేషన్ మీదుగా వెళ్తున్నప్పటికీ హాల్టింగ్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నశంకరంపేట– మిర్జాపల్లి రోడ్డులో అనేక పరిశ్రమలు నెలకొల్పారు. నిత్యం ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అజంతా ఎక్స్‌ప్రెస్‌తో పాటు నూతనంగా మెదక్ వరకు పొడిగించనున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు మిర్జాపల్లిలో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
హాల్టింగ్ ఎప్పుడో!
Comments
Please login to add a commentAdd a comment