ట్రామా ‘కేర్’ ఏదీ?
సెంటర్ ఏర్పాటులో తీవ్ర జాప్యం
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో ట్రామా కేర్ సెంటర్ ప్రతిపాదనలకే పరిమితమైంది. జాతీయ రహదారులు, జిల్లా శివారులో ఉన్న పట్టణ ఆస్పత్రుల్లో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించినా అమలుకు నోచుకోవడం లేదు. రామాయంపేట మీదుగా జాతీయ రహదారి– 47తో పాటు నూతనంగా నిర్మిస్తున్న 765 డీజీ విస్తరించి ఉన్నాయి. రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో చేగుంట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నార్సింగి, నిజాంపేట, నార్సింగి మండలాలున్నాయి. వీటిలో రామాయంపేట, నార్సింగి, చేగుంట మండలాలు జాతీయ రహదారి 47పై ఉన్నాయి. ఈ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాధితులను వైద్య సేవల కోసం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలిస్తున్నారు. అయితే అక్కడ సరైన వైద్య సేవలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఆర్థోపెడిక్ సేవలు అందుబాటులో లేకపోవడంతో క్షత్రగాత్రులను 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అక్కడ సకాలంలో వైద్య సేవలు అందక మధ్యలోనే చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ట్రామా కేర్ సెంటర్లలో ప్రమాద బాధితులకు సత్వరమే శస్త్ర చికిత్స చేయడానికి వీలుగా అన్ని విభాగాలకు సంబంధించిన నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారు. అలాగే ఆస్పత్రికి ప్రత్యేకంగా అంబులెన్స్ సదుపాయం ఉంటుంది. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కోసం అధికారులు పలుమార్లు ప్రతిపాదనలు పంపినా మంజూరు రాలేదు. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సైతం ఈ అంశం ప్రస్తావించారు.
ఇదే విషయమై జిల్లా ఆస్పత్రిల కోఆర్డినేటర్ డాక్టర్ శివదయాళ్‌ను వివరణ కోరగా .. రామాయంపేటలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు అవసరమని, ఇందుకోసం గతంలోనే ప్రతిపాదనలు పంపామని తెలిపారు. సెంటర్ ఏర్పాటైతే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షత్రగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment