అంగన్‌వాడీలకు మహర్దశ
వసతుల కల్పనకురూ. 90.52 లక్షలు మంజూరు
● ముమ్మరంగా సాగుతున్న పనులు
జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాలకు మహర్దశ కలగనుంది. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
మెదక్‌జోన్: ఆట పాటలతో చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించే అంగన్ వాడీ కేంద్రాలకు మంచి రోజులొచ్చాయి. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం రూ. 90.52 లక్షల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, చిన్న చిన్న మరమ్మతులు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,075 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో 369 సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. అద్దె భవనాల్లో 302, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్‌లో 404 కేంద్రాలు కొనసాగుతున్నాయి. వాటిలో 52,780 మంది చిన్నారులు ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు. కాగా అనేక కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవటంతో చిన్నారులు అవస్థలు పడుతున్నారు. దీంతో తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మరమ్మతుల కోసం ‘సాక్ష్యం’పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కాగా జిల్లాలో 282 కేంద్రాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. 227 కేంద్రాల్లో మరుగుదొడ్లు లేకపోవటంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఒంటికి, రెంటికి వస్తే ఇళ్లకు వెళ్లి తిరిగి పాఠశాలకు రావడం లేదు. ఈ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఒక్కో నిర్మాణానికి రూ. 36 వేల చొప్పున రూ. 81,72,000 నిధులు కేటాయించారు. అలాగే 40 కేంద్రాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో, ఒక్కో కేంద్రానికి రూ. 17 వేల చొప్పున రూ. 6,80,000 మంజూరయ్యాయి. వీటితో సంపు నిర్మాణం, భవనంపై ట్యాంకు, నల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 15 అంగన్ వాడీ కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నింటిలో తలుపులు, కిటీకీలు దెబ్బతినగా.. మరికొన్ని వర్షాకాలంలో ఉరుస్తున్నాయి. వీటిలో మరమ్మతుల కోసం మరో రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. ఈ లెక్కన మొత్తం రూ. 90.52 లక్షల నిధులు మంజూరు కావటంతో పంచాయతీరాజ్‌శాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
జిల్లాలో ఇలా..
అంగన్ వాడీ
కేంద్రాలు 1,075
నూతనంగా నిర్మించే
మరుగుదొడ్లు 227
తాగునీటి సౌకర్యం
కల్పించే కేంద్రాలు 40
కేటాయించిన
నిధులు (లక్షల్లో) రూ.90.52
పనులు చకచకా సాగుతున్నాయి
అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్, తాగునీటి వసతిలేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు కావడంతో పనులు చక చక కొనసాగుతున్నాయి. దీంతో శాశ్వతంగా సమస్యలు తీరనున్నాయి.
– హైమావతి, డీడబ్ల్యూఓ
అంగన్‌వాడీలకు మహర్దశ
Comments
Please login to add a commentAdd a comment