రైతుల అభివృద్ధికి కృషి చేయాలి
డీఏఓ వినయ్ విన్సెంట్
కౌడిపల్లి(నర్సాపూర్): నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేసి రైతుల అభివృద్ధికి డీలర్లు కృషి చేయాలని డీఏఓ వినయ్ విన్సెంట్ అన్నారు. బుధవారం మండలంలోని తునికి కేవీకేలో జాతీయ విస్తరణ యాజమాన్య సంస్థ, వ్యవసాయశాఖ, ఆత్మ సౌజన్యంతో 48 వారాల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 40 మంది దేశి (డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్) డీలర్లకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. మోతాదుకు మించి ఎరువులు వాడకుండా చూడాలన్నారు. క్షేత్ర పర్యటన చేస్తూ చీడపీడల ఉధృతిని గమనించి ప్రారంభదశలోనే సరైన పురుగు, తెగులు మందులు వాడేలా చూడాలన్నారు. దీంతో రైతులకు పెట్టుబడి తగ్గి ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. చట్టానికి లోబడి మత్రమే డీలర్లు వ్యాపారం చేయాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ మాట్లాడుతూ.. రైతులు జీవన ఎరువులు వాడేవిధంగా అలవాటు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, దేశి కోఆర్డినేటర్లు అమరేష్‌కుమార్, నరేంద్ర, కేవీకే శాస్త్రవేత్త రవికుమార్, డీలర్లు పాల్గొన్నారు.
పంట కోతలపై అవగాహన అవసరం
నర్సాపూర్ రూరల్: పంట కోతలపై ప్రతి రైతుకు అవగాహన అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ అన్నారు. బుధవారం మండలంలోని ఇబ్రహీంబాద్, రెడ్డిపల్లి, లింగాపూర్, అవంచ రైతు వేదికల్లో ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులకు పంట కోతలపై అవగాహన కల్పించారు. పంట పూర్తి పక్వానికి వచ్చిన తర్వాతే కోతలు మొదలుపెట్టాలని సూచించారు. హార్వెస్టర్ ఆర్‌పీఎం 18 నుంచి 20 లేదా ఆపైన ఉండేలా చూసుకోవాలన్నారు. ధాన్యాన్ని తప్పకుండా ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఏడీఏ సంధ్యారాణి, మండల వ్యవసాయ అధికారి దీపిక, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment