
నిబంధనలకు పాతర
ఏడుపాయలలో మొక్కుబడి పనులు
● అందినకాడికి పంచుకుంటున్న నాయకులు ● గతేడాది జాతరకు రూ. 2 కోట్లు మంజూరు ● రూ. 2.28 కోట్ల బిల్లుల సమర్పణ ● తాత్కాలిక పనులతోనే సరి..
పాపన్నపేట(మెదక్): ’ఏడుపాయల జాతరలో కేవలం డెకరేషన్, వీడియో కవరేజీ, సాంగ్ రికార్డింగ్, లైటింగ్ తదితర ఏర్పాట్లకు రూ. 75 లక్షలు ఖర్చు అయ్యాయి’ అంటే.. ఏ మేర నిధులు విచ్చలవిడిగా ఖర్చు అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. జాతర నిధులు వెల్లువలా పారుతుండగా.. నిబంధనలకు పాతరేసి అధికారులు, నాయకులు అందినకాడికి పంచుకుంటున్నారు. ఏటా ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ. 2 కోట్లు.. తాత్కాలిక పనులకే హారతి కర్పూరమవుతున్నాయి. మట్టి కొట్టు.. ట్యాంకర్లు పెట్టు.. పైసలు పట్టు అన్నట్లు స్థానిక నాయకులు పోటీ పడి మొక్కుబడి పనులు చేస్తున్నారు. పనికి తగిన చెల్లింపులు చేయాల్సిన డిపార్ట్‌మెంట్ అధికారులు కమీషన్లకు ఆశపడి వారికి అనుకూలంగా ఎంబీ రికార్డులు చేస్తున్నారు. గతేడాది జాతరకు రూ. 2 కోట్లు మంజూరు కాగా, అధికారులు రూ. 2,28,16,117 బిల్లులు రికార్డు చేసి మంజూరు చేయాలంటూ సిఫారసు చేశారు. అయితే కలెక్టర్ బిల్లులు పునః పరిశీలించి వాటిని రూ. 1,99,79,795కు కుదించి మంజూరు చేశారు.
2016 నుంచి నిధులు విడుదల
రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన ఏడుపాయల జాతరకు 2016 నుంచి ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్నారు. అప్పటి నుంచి ఏటా పెంచుతూ ప్రస్తుతం రూ. 2 కోట్లు మంజూరు చేస్తున్నారు. ఏటా జాతరలో కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేలా తాత్కాలిక పనులే చేపడుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఈ నిధులను సంబంధిత శాఖల అధికారులు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ చేసేది మాత్రం అధికార పక్షంలో ఉన్న నాయకులు మాత్రమే. గతేడాది డెకరేషన్, వీడియో కవరేజ్, తాగునీరు, సానిటేషన్, బారికేడ్లు, తాత్కాలిక ఘాట్లు, పార్కింగ్, ఫ్లెక్సీలు, క్యూలైన్లు తదితర పనులకు సుమారు రూ. 1.50 కోట్లు ఖర్చు అయినట్లు చూపారు. ఇందులో కర్రలతో చేసే బారికేడింగ్ కోసం గత 8 ఏళ్ల నుంచి చేస్తున్న ఖర్చుతో, పర్మనెంట్‌గా మంజీరా చుట్టూ ఇనుప రాడ్లు వేసి జాలి వేయొచ్చని పలువురు భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ప్రతిఏటా అధికారుల కోసం వేసే షెడ్లు, తాత్కాలికంగా నిర్మించే టాయిలెట్ల బదులు పర్మనెంట్‌వి ఏర్పాటు చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment