
’ఆవాసం’.. పేద విద్యార్థులకు వరం
నేడు 19వ వార్షికోత్సవం
రామాయంపేట(మెదక్): రామాయంపేటలోని ఆవాస విద్యాలయం నిరుపేద విద్యార్ధులకు వరంగా మారింది. 2006లో ప్రారంభమైన పాఠశాల ఇంతింతై వటుడింతైనట్లు దినదినాభివృద్ధి చెందుతుంది. పేద విద్యార్థుల్లో వెలుగులు నింపుతుంది. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది. ఆదివారం 19వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా ప్రత్యేక కథనం..ట్రాన్స్‌కో మాజీ ఉద్యోగి కృష్ణారెడ్డి సేవాభారతి సంస్థ ద్వారా ఈ పాఠశాలను ప్రారంభించారు. మొదల్లో కేవలం 10 మందితో ప్రారంభం కాగా.. నేడు 60 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కృష్ణారెడ్డి సేవాభావాన్ని ప్రత్యక్షంగా చూసిన కొందరు దాతలు స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తూ విద్యాలయం అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కొంద రు ప్రవాస భారతీయులు సైతం విద్యార్థులను దత్తత తీసుకొని చదివిస్తున్నారు. ఇందులో చదువుకుంటున్న వారంతా ప్రతిభ ఉన్న నిరుపేదలే. ఇక్క డ కుల మతాలకు తావు లేదు. అన్నివర్గాల వారు ఈ విద్యాలయంలో చదువుకుంటున్నారు. కాగా తల్లిదండ్రులు లేని పిల్లలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఏటా పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసుకుంటున్నారు. అనంతరం ఎంపికైన విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి కుటుంబ పరిస్థితులను ప్రత్యక్ష్యంగా చూసిన తర్వాతే విద్యాలయంలో చేర్చుకుంటున్నారు. వారికి భోజనంతో పాటు దుస్తులు, దుప్ప ట్లు, ట్రంక్ పెట్టెలు, ఇతర సామగ్రి అందజేస్తున్నారు.
యోగా, కర్రసాములో శిక్షణ
ఇందులో చదువుతున్న విద్యార్థులకు దేశభక్తి విషయమై ప్రత్యేకంగా బోధించడంతో పాటు చదువు, సంస్కారం నేర్పుతారు. విద్యార్థులు సమాజంలో తమ బాధ్యతలను గుర్తెరిగి ముందుకు సాగే విధంగా తర్పీదు ఇస్తున్నారు. వీటితో పాటు కర్ర సాము, యోగాలో శిక్షణ ఇస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment