తెలుగు బుల్లితెరపై 106 రోజులు వినోదాన్ని అందించిన బిగ్‌బాస్ సీజన్ 4 డిసెంబర్ 20న శుభంకార్డు పడిన విషయం తెలిసిందే. కరోనా కష్ట కాలంలో అసలు ఈ ఏడాది బిగ్‌బాస్ ఉంటుందో లేదో అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి అందరిని అలరించింది. 29 మంది కంటెస్టులతో ప్రారంభమైన బిగ్‌బాస్ సక్సెస్‌ఫుల్‌గా నాలుగో సీజన్‌ను పూర్తి చేసుకుంది. స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్ బిగ్‌బాస్–4 ట్రోఫీ అందుకున్నాడు. 25 లక్షల ప్రైజ్‌మనీతోపాటు ఓ బైక్ గెలుచుకున్నాడు. అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. మూడో స్థానంలో సోహైల్, నాలుగు, అయిదు స్థానాల్లో అరియానా, హారిక నిలిచారు. టాప్ 5 కంటెస్టెంట్లందరికిరు హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం గ్రాండ్‌గా బ్యాండ్ బాజాలతో ఇంటికి పయనమయ్యారు. చదవండి: బిగ్‌బాస్: అభి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా
కాగా అభిజిత్ తన వ్యక్తిత్వంతో షో ప్రారంభం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులను దక్కించుకున్నాడు. చివరి వరకు అభిజిత్‌పై అదే అభిమానం కురిపిస్తూ అతన్ని విజయ తీరానికి నడిపించింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కూడా అభిజిత్‌దే గెలుపు అంటూ పలువురు చెప్పిన జోస్యం, అంచనాలకు అనుగుణంగానే తుది ఫలితం ఉండడం విశేషం. ఇదిలా ఉండగా బిగ్‌బాస్ ముగిసినప్పటికీ ఈ షోకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా విన్నర్‌గా నిలిచిన అభిజిత్ షో మొత్తం రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విజేతగా నిలిచిన అభిజిత్ బిగ్‌బాస్ షో కోసం వారానికి 4 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 106 రోజులకు 60 లక్షలు, ప్రైజ్ మనీ 25 లక్షలు కలిపి మొత్తం 85 లక్షలు అభికి మూటజెప్పినట్లు టాక్. వాస్తవానికి బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ కంటే హౌజ్‌లో ఉన్నందుకే అభి అధికంగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. అదే విధంగా టీవీ యాంకర్ లాస్యకు ఒక వారానికి లక్ష రూపాయల చొప్పున తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ కూడా వారానికి ఏకంగా 2 లక్షలు డిమాండ్ చేసినట్లు వదంతులు వ్యాపించాయి.
Comments
Please login to add a commentAdd a comment