బుల్లితెర ప్రేక్షకులను 106 రోజులపాటు అలరించిన బిగ్ రియాల్టీ రియాలిటీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు శుభం కార్డు పడింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేకు గ్రాండ్ ఫినాలే వేడుకలో సినీ తారలు అదిరిపోయే ప్రదర్శనతో అలరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ రియాలిటీ షో విజేతగా యువ హీరో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. ట్రోఫీ కోసం 19 మంది బరిలోకి దిగి చివరికి ఫినాలే వరకు ఐదుగురు మాత్రమే మిగిలారు. అయితే ఈ ఐదుగురు బిగ్ బాస్ విన్నింగ్ ట్రోఫీకి తీవ్రంగా కృషి చేశారు. కానీ చివరు గెలుపు మాత్రం మిస్టర్ కూల్ అభిజిత్‌ను వరించింది. అయితే ఇది ఒక వారం రోజులు పాటు చూసిన ఇచ్చిన ట్రోఫి కాదు. 105 రోజుల పాటు అతని ఆట తీరు, ప్రవర్తను బట్టి బిగ్‌బాస్ ట్రోఫీ లభించింది. మరి అంతమందిలో అభి మాత్రమే ఎలా విజయం సాధించాడు. అసలు ఆయన బిగ్‌బాస్ జర్నీలో ట్రోపి కొట్టడానికి ఉపయోగపడ్డ అంశాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం
బుద్ది బలంతో కొట్టాడు
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్‌ను ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయారు. బిగ్‌బాస్‌లోకి వచ్చినప్పడు కూడా అభిజిత్‌పై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. షో ఆరంభంలో అతడిపై ఎలాంటి అంచనాలూ లేవు. షో హైపు కోసం, అమ్మాయిలతో ట్రాకులు నడపడం కోసమే అభిని ఎంచుకున్నారని అనుకున్నారు. కానీ క్రమ క్రమంగా అభిజిత్ టాలెంట్ బయటపడింది. కండబలంతో కాకుండా బుద్ది బలంతో గేమ్ ఆడడం ప్రేక్షకులను ఆకర్షించింది. మాస్టర్ మైండ్‌తో అతడు తీసుకున్న నిర్ణయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టాస్క్ వచ్చిందంటే చాలు అందులో ఈజీగా ఎలా గెలవచ్చు అనేదానిపై అభి ఫోకస్ ఉండేది.
అత్యధిక సార్లు నామినేషన్‌లో
బిగ్‌బాస్‌లో అత్యంత కీలకమైనది నామినేషన్. ప్రతి సోమవారం జరిగే ఈ నామినేషన్ ప్రక్రియను చూసి ఇంటి సభ్యులంతా గజ గజ వణికిపోయేది.ఒక అభిజిత్ తప్ప. ఆయన నామినేషన్‌ను సానుకూలంగా స్వీకరించేవాడు. సరైన కారణాలతో ఇతరులను నామినేట్ చేసేవాడు. ఎవరైనా తనను నామినేట్ చేసినా మిగతా వాళ్లలాగా గొడవకు దిగకుండా.. నామినేషన్లను స్వాగతించేవాడు. అభిజీత్‌ను హౌస్‌మేట్స్ అంతా కలిసి 11 సార్లు నామినేట్ చేశారు. నామినేషన్ జరిగిన 14 వారాల్లో 11 సార్లు నామినేట్ అవడం వల్ల ప్రేక్షకులు అతడికి ఓట్లు వేయడానికి అలవాటు పడ్డారు. ఇది కూడా అతడి విజయానికి కారణమైంది. గత రెండు సీజన్ల విన్నర్లు రాహుల్, కౌషల్ కూడా 11 సార్లు నామినేట్ కావడం గమనార్హం.
మిస్టర్ కూల్‌గా పేరు
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో అతి తక్కువ గొడవలు పెట్టుకున్న ఏకైక వ్యక్తి ఒక అభిజితే అని చెప్పొచ్చు. ఒక్క నామినేషన్ టాస్కుల్లో తప్ప ఆయన ఎప్పుడూ ఎవరితో గొడవపడలేదు. కామ్‌గా ఉంటూ.. నామినేషన్‌ను కూడా సీరియస్‌గా తీసుకునేవాడు కాదు. క్లిష్ట సమయంలోనూ సహనాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల ఓట్లను సంపాదించాడు. అలాగే లవ్ ట్రాకులకు ఆయన దూరంగా ఉన్నాడు. మోనాల్ విషయంలోనూ అభి నిర్ణయం అందరిని అబ్బురపరిచింది. అఖిల్ ఆమెకు దగ్గరైనప్పుడు అభి దూరంగా ఉంటడం. ఆమెపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం కలిసొచ్చింది. ఇక అఖిల్, మోనాల్ ప్రవర్తన కూడా అభికి ప్లస్ అయింది.
ఒక్క టాస్క్... అభిని హీరో చేసింది
నాల్గో సీజన్ మొత్తంలో అతి తక్కువగా టాస్క్‌లు ఆడింది మాత్రం అభిజిత్. ఇందులో సందేహం లేదు. మిగతావాళ్లు వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడినా.. అభి మాత్రం ఫిజికల్ టాస్కులు మాత్రం అంతగా ఆడేవాడు కాదు. కానీ ఒకే ఒక టాస్క్ అభికి మంచి పేరు తెచ్చి విజయానికి కారణమైంది. అదే రోబో టాస్క్. బిగ్ బాస్ ఇచ్చిన రోబో టాస్క్‌లో అతడు దివిని కిడ్నాప్ చేయడం పెద్ద సంచలనం అయింది. అప్పుడు సోహెల్, మెహబూబ్, అఖిల్, మోనాల్‌లు అతడిని తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో కొట్టేందుకు మీదకెళ్లారు. కానీ అభి మాత్రం తన సహనంతో గేమ్ ప్లాన్‌ను వివరించాడే తప్ప.. గొడవకు సై అనలేదు. అప్పుడే అభి పట్ల ప్రేక్షకుల్లో సానుభూతి పెరిగింది. గేమ్‌ను గేమ్‌లాగే ఆడాడని అతనికి ఓట్లు వేయడం మొదలుపెట్టారు.
నోయల్, లాస్యల ఫ్రెండ్‌షిప్
హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన నోయల్, లాస్యల మద్దతు కూడా అభికి కలిసొచ్చింది. హౌస్‌లో ఉన్నప్పుడు తక్కువ మాట్లాడినా.. అందరితో మాత్రం అభి టచ్‌లో ఉండేవాడు. అతను అంతగా మాట్లాడనప్పటికీ అభిపై మాత్రం ఇంటి సభ్యులకు కోపం ఉండేది కాదు. ప్రతి ఒక్కరు అభితో ఫ్రెండ్‌షిప్ చేయడానికే ఇష్టపడేవారు. ఇక నోయల్ అయితే తన సపోర్ట్ అభిజిత్‌కే అని బహిరంగంగా చెప్పేశాడు. అభి గెలుపును తన భుజానా వేసుకుంటానని, అయన ఇంట్లో గేమ్ ఆడితే తాను బయట అతనికి చేయాల్సిన సాయం చేస్తానని నాగార్జున ముందే చెప్పేశాడు. చెప్పడమే కాదు చేసి చూపించాడు కూడా.
కలిసొచ్చిన సినీ పెద్దల మద్దతు
ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు అభి గురించి పాజిటివ్‌గానే చెప్పారు కానీ నెగెటివ్‌గా ఒక్కరు కూడా చెప్పకపోవడం కూడా అభికి ఓట్లు పడేలా చేశాయి. వీటితో పాటు సినీ ప్రముఖుల సపోర్టు కూడా అభికి కలిసొచ్చింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మెగా బ్రదర్ నాగబాబు, శ్రీకాంత్ సహా ఎంతో మంది అతడికి సపోర్ట్ చేశారు. నాగబాబు అయితే అవినాష్‌కి ఓట్లు వేయమని చెబుతూనే.. తనకు మాత్రం అభిజితే ఇష్టమని చెప్పాడు. అతను బాగా ఆడుతున్నాడని, తన ప్రవర్తన బాగా నచ్చిందని అభిని ఆకాశానికెత్తేశాడు. ఇక ప్రతి సీజన్‌ని ఫాలో అయ్యే శ్రీకాంత్ సైతం అభికే నా ఓటు అటు తేల్చేశాడు. సోషల్ మీడియా వేదికగా అతన్ని గెలిపించమని అభిమానులకు పిలుపునిచ్చారు. మొత్తానికి అభి ప్రవర్తననే ఆయన గెలుపుకు కారణమని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment