
ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదల కానుంది. హీరో నాని ప్రోడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో నానితో పాటు నాగ్ అశ్విన్, మోహనకృష్ణ ఇంద్రగంటి, ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, శైలేశ్ కొలను, శౌర్యువ్ తదితరులు పాల్గొన్నారు.
'కోర్ట్' సినిమా సమర్పకుడు నాని ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 16ఏళ్లు దాటింది. దయ చేసి ఈ సినిమా చూడండి అని నేనెప్పుడూ అడగలేదు. తొలిసారి ఈ మాట ప్రేక్షకులను అడుగుతున్నాను. ఈ సినిమా నిర్మాతగా చెప్పడం లేదు, నా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమా మిస్ అవ్వొద్దని కోరుకుంటున్నా. దయచేసి కోర్టు చిత్రాన్ని ఇంటిల్లిపాది చూడండి. కోర్టు చిత్రం చూసిన వారంతా గర్వంగా థియేటర్ల నుంచి బయటికి వస్తారు.
'కోర్టు' సినిమా కంటే హిట్ 3పై పది రెట్లు ఖర్చుపెట్టాను. ఈ చిత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోకపోతే నా నెక్స్ట్ మూవీ 'హిట్3'ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా మీకు చెప్పలేను. ఈ సినిమాతో మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలోని పాత్రలతో ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్‌తో కనెక్ట్ అయిపోతారు. ఆ పాత్రలతో పాటుగా మీరు కూడా నవ్వడమే కాకుండా ఏడిపించేస్తారు.' అని నాని అన్నారు.
