సినిమా విడుదల రోజునే రివ్యూల ఇవ్వడం కారణంగా ఆ చిత్రాల కలెక్షన్లకు ముప్పు ఏర్పడుతుందనే వాదనను ఇటీవల మద్రాస్ న్యాయస్థానం కూడా కొట్టేసిన సంగతి తెలిసిందే. నటుడు సిద్దార్థ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'మిస్ యూ'. నటి ఆషికా రంగనాథ్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని 7 మైల్స్ ఫర్ సెకండ్స్ పతాకంపై సామువేల్ మ్యాథ్యూ నిర్మించారు. దీనికి ఎన్.రాజశేఖర్ దర్శకత్వం వహించారు. జయప్రకాశ్, పొన్‌వన్నన్, నరేన్, అనుపమకుమార్, బాలా శరవణన్, లొల్లుసభ మారన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గత నెల 29వ తేదీనే విడుదల కావాల్సి ఉంది.
అయితే తుపాన్ కారణంగా విడుదల తేదీని వాయిదా వేశారు. తాజాగా మిస్ యూ చిత్రాన్ని ఈ నెల 13వ తేదీన తెరపైకి తీసుకువస్తున్నట్లు నటుడు సిద్ధార్థ్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ సినిమా విడుదలకు ఒక మంచి తేదీ లభించడం వరంగానే భావిస్తానన్నారు. అయితే 13ను హార్రర్ తేదీగా పేర్కొంటారని, అలాంటిది ఒక మంచి ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా రూపొందించిన తమ మిస్ యూ చిత్రాన్ని 13వ తేదీన విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 9 పాటలతో కూడిన ఒక మంచి ప్రేమ కథా చిత్రం తనకు తమిళంలో చాలా కాలం తరువాత వచ్చిందన్నారు.
ఈ చిత్రానికి ప్రేక్షకులు ఇచ్చే ఆదరణను బట్టి ప్రేక్షకులు కుటుంబ సమేతంగా చూసి ఆనందించే పలు చిత్రాలను చేస్తానని చెప్పారు. ఈ ఏడాది తాను నటించిన రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది మాధవన్, నయనతార, తాను కలిసి నటించిన టెస్ట్, శ్రీగణేశ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తదితర మూడు చిత్రాలు తెరపైకి వస్తాయని చెప్పారు. ఒక చిత్రం విడుదలైతే అది అందరికీ సొంతం అన్నారు. డబ్బుతో టిక్కెట్ కొని చిత్రం చూసే ప్రేక్షకులకు అభిప్రాయాలను చెప్పే భావ స్వేచ్ఛ ఉంటుందని నటుడు సిద్ధార్థ్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment