తమిళ సినిమా: సూపర్‌స్టార్ రజినీకాంత్ తర్వాత ఆస్థాయిలో అభిమానులను కలిగిన నటుడు విజయ్. ఈయన తన అభిమాన సంఘాల ద్వారా తమిళ ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌కి రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆసక్తి ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన నేరుగా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వకపోయినా ఆయన అభిమానులు కొందరు తమిళనాడులోని పలు నియోజకవర్గాల్లో ఆ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇకపోతే విజయ్ తన అభిమానులను కనీసం ఏడాదికి ఒకసారైనా కలుస్తూ ఉంటారు.
అలాంటిది కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన తన అభిమానులతో ప్రత్యేకంగా భేటీ కాలేదు. దీంతో ఆదివారం మధ్యాహ్నం విజయ్ స్థానిక పనైయూర్‌లోని తన కార్యాలయంలో అభిమాన సంఘ నిర్వహకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కారణం విజయ్ తాజాగా నటిస్తున్న వారిసు చిత్ర తమిళం, తెలుగు భాషల్లో సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.
కాగా అదే సందర్భంగా చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. దీంతో థియేటర్ల సమస్య ఏర్పడే పరిస్థితి నెలకొనడంతో తెలుగు సినీ నిర్మాతల మండలి పండగ రోజుల్లో తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రకటనను ఇటీవల చేసింది. ఇది తమిళ చిత్రశ్రమంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నామ్ తమిళర్ కట్చి పార్టీ నేత సీమాన్ వంటి వారు తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య నటుడు విజయ్ తన అభిమానులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏఏ విషయాలను గురించి చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వారిసు చిత్ర విడుదల వివాదం గురించి అభిమానులతో చర్చిస్తారా..? ఈ వ్యవహారంలో వారు ఎలా వ్యవహరించాలనే సూచనలు చేస్తారా? వంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, వారిసు చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఆదివారం తన ట్విట్టర్లో స్పష్టం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment