
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆ లోకాన్ని వీడి మూడు నెలలు దాటినా అతడి మరణానికి గల స్సష్టమైన కారణాలు మాత్రం ఇంతవరకు వెల్లడికాలేదు. బంధుప్రీతి, బాలీవుడ్ ప్రముఖుల విపరీత పోకడల అంశం చుట్టూ తిరిగిన ఈ కేసు డ్రగ్స్ వ్యవహారంతో మరో మలుపు తీసుకుంది. మీడియా, సోషల్ మీడియాలో మాదక ద్రవ్యాల కేసు గురించే విపరీతచర్చ జరుగుతోంది. దీంతో సుశాంత్ మృతి కేసును పక్కదోవ పట్టిస్తున్నారని, అతడిది ఆత్మహత్యా లేదా హత్యా అన్నది తేల్చడంలో సీబీఐ ఎందుకు ఆలస్యం చేస్తోందంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ కుటుంబ లాయర్ వికాస్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. (చదవండి: డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!)
ఈ మేరకు.. ఎయిమ్స్ బృందంలోని ఓ డాక్టర్‌కు తాను గతంలో కొన్ని ఫొటోలు పంపించానని, అందులో సుశాంత్ మెడపై కొన్ని గుర్తులున్నట్లు స్పష్టంగా తేలిందన్నారు. వాటిని బట్టి సుశాంత్‌ను ఎవరో గొంతు నులిమి చంపేశారని, అయితే 200 శాతం సూసైడ్ కాదని చెప్పుకొచ్చారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా ఈ కేసును మర్డర్ కేసుగా మార్చడంలో సీబీఐ జాప్యం చేయడం విసుగు తెప్పిస్తోందంటూ వికాస్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇందుకు స్పందనగా సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ కీర్తి సైతం.. ‘‘చాలా రోజుల నుంచి ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నాం! నిజాన్ని వెలికితీసేందుకు ఇంకెంత సమయం పడుతుంది?’’అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా సుశాంత్ కేసును పరిశీలిస్తున్న ఎయిమ్స్ ఫోరెన్సిక్ టీం పానెల్ చీఫ్ వికాస్ సింగ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. మృతుడి శరీరంపై ఉన్న మరకల ఆధారంగా ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని, రిపోర్టు వచ్చేంత వరకు కాస్త ఓపికగా వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి ప్రస్తుతం డ్రగ్స్ కేసులో బైకుల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
We have been so patient for so long! How long will it take to find the truth? #SSRDeathCase https://t.co/Vn5R62a0SY
— Shweta Singh Kirti (@shwetasinghkirt) September 25, 2020