
నటుడు అజిత్ తన వయసుకు దగ్గ పాత్రలో నటించడం ప్రారంభించి చాలా కాలమైంది. ఆయనకు జతగా నటించే హీరోయిన్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆమధ్య వివేకం చిత్రంలో కాజల్ అగర్వాల్, విశ్వాసం చిత్రంలో నయనతార, వలిమై చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి అజిత్ సరసన నటించారు. తాజాగా విడుదలైన తుణివు చిత్రంలో మలయాళ భామ మంజువారియర్ నటించారు. వీళ్లందరూ వయసులో సీనియర్ నటీమణులే అనేది గమనార్హం. కాగా తుణివు చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో అజిత్ ఇప్పుడు తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు.
నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్‌శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. అయితే ఇందులో అజిత్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. కారణం పలువురు ప్రముఖ హీరోయిన్ల పేర్లు ప్రచారంలో ఉండడమే. ముందుగా నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చిత్రంలో హీరోయిన్ పాత్ర ఆమె స్థాయికి తగ్గట్టుగా లేకపోవడంతో ఆమె నటించడం లేదని ప్రచారం జరిగింది.
ఆ తర్వాత త్రిష తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా ఇందులో నటించడం లేదని సమాచారం. అదేవిధంగా ఇటీవల నటి ఐశ్వర్యరాయ్ అజిత్ సరసన నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నటి సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. విషయం ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరి పేరు ఇప్పటివరకు చిత్ర వర్గాలు ప్రకటించలేదు. చిత్రం షూటింగ్ దగ్గర పడుతుండడంతో చిత్ర వర్గాలు అసలు హీరోయిన్ ఎంపిక చేశారా, చేస్తే ఆ విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారా? అనే చర్చ కోలీవుడ్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment