సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప' 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం సుమారు రూ. 170 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. బన్నీ- రష్మిక మందన్నల యాక్టింగ్ ఈ సినిమా విజయానికి బలమైన కారణమైతే.. సినిమా చివరి భాగంలో ఫహద్ ఫాజిల్ పాత్ర హైలెట్‌గా నిలిచింది. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ సినిమా కోసం 'ఉ అంటావా... ఊ ఊ అంటావా..' పాటలో ప్రత్యేకంగా కనిపించింది.
ఇలా పుష్ప సినిమాకు ఎన్నో అదనపు ఆకర్షణలతో విడుదలై.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ. 373 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. నేటికి (డిసెంబర్ 17) ఈ సినిమా విడదులై రెండు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులతో పాటు పలు ఆసక్తకరమైన విషయాలు మరోసారి గుర్తుచేసుకుందాం.
► అల్లు అర్జున్‌కు పుష్ప తొలి పాన్ ఇండియా సినిమా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేశారు.
► ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా నిడివి 2: 59 గంటలు. 'పుష్ప' అత్యధిక భాగం అడవుల్లోనే షూట్ చేశారు. అందుకోసం మారేడుమిల్లి అడవులను ఎంపిక చేసుకున్నారు.
► అల్లు అర్జున్ 'పుష్ప' గెటప్‌లో రెడీ అయ్యేందుకు మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదని బన్నీ చెప్పాడు. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి సెట్‌కు వెళ్లితే.. ఉదయం 5 నుంచి 7 వరకూ మేకప్ కోసమే సమయం పట్టేదట. షూటింగ్ పనులు పూర్తయ్యాక మేకప్ తీయడానికి 30 నిమిషాల సమయం పట్టేదని బన్నీ గతంలో చెప్పాడు.
► ఈ సినిమాలోని పాటలు అన్నీ కలిపి యూట్యూబ్‌లో 7బిలియన్ వ్యూస్ సాధించాయి. అంటే 700కోట్ల మంది వీక్షించారు. ఇండియాలో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా పుష్ప రికార్డుకెక్కింది.
► యూట్యూబ్ 'టాప్ 100 గ్లోబల్ సాంగ్స్' జాబితాలో 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!' పాట మొదటి స్థానంలో నిలవగా.. 'సామీ సామీ' పాట రెండో స్థానం దక్కించుకుంది. దాక్కో దాక్కో మేక 24వ స్థానంలో ఉంటే శ్రీవల్లి సాంగ్ 74వ ప్లేసులో నిలిచింది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాట మాత్రం 97వ స్థానంలో నిలిచింది.
► 'ఆర్య'తో బన్నీకి సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్.. దాదాపు పదేళ్ల తర్వాత 'పుష్ప' కోసం మళ్లీ వాళ్లిద్దరూ ఈ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు.
► ప్రపంచవ్యాప్తంగా పుష్ప రూ.373కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది.
►ఓటీటీలోనూ 'పుష్ప' గాడు దుమ్ములేపాడు. 2022లో అమెజాన్‌ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్ ఏమాత్రం తగ్గలేదు. 2022లో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది. అప్పట్లో 10మిలియన్+ ఇన్‌స్టా రీల్స్ క్రియేట్ చేసి ఇండియాలో పుష్పతో ఇన్‌స్టాగ్రామ్‌నే షేక్ చేశాడు.
► అవార్డుల విషయంలోనూ 'తగ్గేదేలే' అంటూ దూసుకుపోయాడు. ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు ఏడు సైమా అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
► ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్- 2022 పుష్పకు దక్కింది
► పుష్ప సినిమాకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ హీరోగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌కు దక్కాయి.
► 7 ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డ్స్‌ను దక్కించుకున్న పుష్ప.
Comments
Please login to add a commentAdd a comment