బాలీవుడ్ పెద్ద దిక్కు అమితాబ్ బచ్చన్ ఈ మధ్య తరచూ ట్రోలింగ్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా అక్కడి ఆసుపత్రిని, తనకు సేవలందించిన వైద్యులు, నర్సులు అందించిన సేవలను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే ఓ మహిళ దీన్ని పూర్తిగా తప్పు పట్టారు. తన తండ్రికి కరోనా లేకపోయినా తప్పుడు రిపోర్టులతో ఆ ఆసుపత్రిలో చేర్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత వేరే ఆసుపత్రిలో చేర్పిస్తే అసలు కరోనా లేదన్న విషయం వెల్లడైందన్నారు. అలాంటి ఆసుపత్రికి బిగ్‌బీ పబ్లిసిటీ చేస్తున్నారని, దీంతో ఆయనపై ఉన్న ఇన్నాళ్ల గౌరవం పూర్తిగా పోయిందని రాసుకొచ్చారు. (కరోనా నుంచి కోలుకున్న అమితాబ్)
దీనిపై స్పందించిన అమితాబ్.. "నేను ఆస్పత్రి కోసం పబ్లిసిటీ చేయడం లేదు. నన్ను సంరక్షించినందుకు, చికిత్స అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు నాపై గౌరవం కోల్పోయినప్పటికీ నేను మాత్రం వైద్యులను గౌరవిస్తాను" అని సున్నితంగా సమాధానమిచ్చారు. మరోవైపు బిగ్‌బీ కరోనా నుంచి కోలుకోవడంతో అమూల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ఇందులో అమితాబ్ ఫోన్ పట్టుకుని కూర్చుంటే పక్కన అమూల్ బేబీ నిల్చుని ఉంది. దీనికి "ఏబీ బీట్స్ సీ" అనే ట్యాగ్‌లైన్‌ను జోడించింది. ఏబీ అంటే అమితాబ్ బచ్చన్ సీ అంటే కరోనా వైరస్‌ను జయించారని అర్థం. ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీంతో ఈ విమర్శలతో అగ్గి మండిన బిగ్‌బీ.. 'నీకు నిజం తెలీకపోతే నోరు మూస్కొని ఉండు' అంటూ గట్టిగానే కౌంటరిచ్చారు. (ఓ అనామకుడా.. నీపై జాలి వేస్తోంది)
Comments
Please login to add a commentAdd a comment