తమ విడాకులను రద్దు చేయాలంటూ బాలీవుడ్ నటుడు అరుణోదయ్ సింగ్ మాజీ భార్య లీ ఎల్టన్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనలు వినకుండా.. ఏకపక్షంగా విడాకులు మంజూరు చేశారని ఆరోపించారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన లీ.. తనకు వ్యతిరేకంగా నమోదైన అభియోగాలు తీవ్రమైనవి కావని, వెంటనే డివోర్స్‌ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా మై తేరా హీరో, జిస్మ్ 2, మొహంజోదారో, సికిందర్ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన అరుణోదయ్ సింగ్.. కెనడాకు చెందిన లీ ఎల్టన్‌తో ప్రేమలో పడ్డాడు.
ఈ క్రమంలో 2016, డిసెంబరులో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైన కొంతకాలం తర్వాత ఈ జంట మధ్య విభేదాలు తలెత్తడంతో భోపాల్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. పెంపుడు కుక్కల విషయంలో జరిగిన గొడవ ముదిరిన నేపథ్యంలో తాము ఇకపై కలిసి ఉండలేమని పేర్కొన్నారు. దీంతో 2019, డిసెంబరులో వీరికి విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
(చదవండి: ఇక సమయం లేదు ప్రియతమా!)
ఈ నేపథ్యంలో కెనడాకు వెళ్లిపోయిన లీ ఎల్టన్ తాజాగా విడాకులను రద్దు చేయాలంటూ ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు తలుపుతట్టారు. ఆమె అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం.. ఇందుకు సంబంధించిన రికార్డులను సమర్పించాల్సిందిగా దిగువ కోర్టును ఆదేశించింది. అక్టోబరు 6కు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. కాగా ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్య తనకు దూరమైపోయిందంటూ అరుణోదయ్ గతేడాది డిసెంబరులో సోషల్ మీడియా వేదికగా తమ వైవాహిక బంధం విచ్ఛిన్నమైన విషయం గురించి భావోద్వేగ పూరిత పోస్టు షేర్ చేశాడు.
(చదవండి: అందుకే నాపై కక్ష గట్టారు.. చూద్దాం: కంగన)
Comments
Please login to add a commentAdd a comment