
బుల్లితెర స్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రామ్‌నగర్ బన్నీ. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రహాస్ తనపై వస్తున్న నెగెటివిటీ, ట్రోలింగ్‌పై స్పందించాడు. ఇది నా తొలి సినిమా. ఇలా స్టేజీ ఎక్కి మాట్లాడి రెండేళ్లవుతోంది. అప్పుడు నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా అని విపరీతంగా ట్రోల్ చేశారు.
తండ్రిని చూసి గర్వపడాలి
అందరిముందు ఒకలా, ఎవరూ లేనప్పుడు మరోలా ప్రవర్తించలేను. పైగా నేను తప్పు చేసినప్పుడు తిడితే పడతాను, కానీ ఏమీ చేయకముందే విమర్శిస్తే మాత్రం సహించను. ఇప్పుడు నేను మా నాన్న గురించి డబ్బా కొట్టబోతున్నాను. ఎవరైనా సరే తండ్రిని చూసి గర్వపడాలి. మీ నాన్నను చూసి గర్వపడటం లేదంటే దానంత దురదృష్టం మరొకటి లేదు.
ఎవ్వర్నీ వదలను
మా నాన్న బుల్లితెర మెగాస్టార్. ఆయనొక డైరెక్టర్, యాక్టర్, నిర్మాత. వేల ఎపిసోడ్లలో నటించడమే కాకుండా ఎన్నో షోస్ చేశాడు. మా నాన్న గొప్ప హీరో కాబట్టి నాకు యాటిట్యూడ్ ఉంటుంది. నన్ను తిట్టినవారే ఈ రామ్‌నగర్ బన్నీ మూవీ చూసి పాజిటివ్‌గా మారతారని అనుకుంటున్నాను. తర్వాతి సినిమాకు మరికొందర్ని పాజిటివ్‌గా మారుస్తా.. అలా నన్ను నెగెటివ్‌గా చూస్తున్నవాళ్లందరినీ పాజటివ్‌గా మార్చేవరకు వదలను.
ఎంకరేజ్ చేయండి
నాలాంటివాడు కనక హిట్టు కొట్టాడంటే ఈ జనరేషన్‌కు పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసినవాడినవుతాను. రేపు పొద్దున థియటర్‌లో యాటిట్యూడ్ స్టార్ అన్న టైటిల్ పడగానే.. మీరందరూ అరిచి ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. నా స్నేహితులు చాలామంది నా స్థానంలో వాళ్లుంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్లమని చెప్పారు. అది తప్పు, నాపై ఎంత దాడి చేసినా సరే.. నాకలాంటి ఆలోచనలు రావు. ట్రోలింగ్ గురించి పెద్దగా పట్టించుకోను, నా పని నేను చేసుకుంటూ పోతాను అని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment