
శ్రీను, భగత్ అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన విదార్థ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు.
టైటిల్ : భగత్ సింగ్ నగర్
నటీనటులు : విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, అజయ్ గోష్, ప్రభావతి తదితరులు
నిర్మాత : వాలాజ గౌరి, రమేష్ ఉడత్తు
దర్శకత్వం: వాలాజ క్రాంతి
సంగీతం : ప్రభాకర్ దమ్ముగారి
సినిమాటోగ్రఫీ : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి
ఎడిటింగ్: జియాన్ శ్రీకాంత్
విడుదల తేది : నవంబర్ 26,2021
ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా ప్రజాదరణ లభిస్తోంది. అయితే చిన్న సినిమాలు అంటే కేవలం బూతు సినిమాలే అని చాలా మంది అనుకుంటారు. కానీ వాటిలో కూడా మంచి సందేశాత్మక చిత్రాలు ఉంటాయి. దానికి నిదర్శనమే ‘భగత్ సింగ్ నగర్’. విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం శుక్రవారం(నవంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచాల మధ్య విడుదలైన ‘భగత్ సింగ్ నగర్’ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
భగత్ సింగ్ నగర్ అనే మురికివాడలో స్నేహితులతో కలిసి సరదాగా తిరిగే కుర్రాడు శ్రీను(విదార్థ్). ఈ తొట్టి గ్యాంగ్‌లో చంద్రయ్య (ముని చంద్ర) అనే తాత కూడా ఉంటాడు. అతని ఇంట్లో పెరిగే అమ్మాయి లక్ష్మి (దృవీక), శ్రీనుతో ప్రేమలో ఉంటుంది. రోజంతా పనిచేయడం.. సాయంత్రం స్నేహితులతో మందుకొట్టడం శ్రీనుకి అలవాటుగా మారుతుంది. అయితే అదే ఏరియాలో మద్యానికి బానిసై కుటుంబాన్ని పాడు చేసుకున్న కొందరిని చూసి శ్రీను మద్యం సేవించడం మానేస్తాడు. ఆ ఏరియాలో గొడవలకు రాకుండా చూసుకుంటాడు. ఇంతలో భగత్ సింగ్ నగర్ లో కొందరు అమ్మాయిలు అపహరణకు గురవుతుంటారు. ఇలా కిడ్నాప్ అయిన అమ్మాయిలు ఏమవుతున్నారో చంద్రయ్య తెలుసుకుంటాడు. కానీ ఈ విషయం ఎవరకి చెప్పడు. శ్రీను లక్ష్మి ల పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకుని పెళ్లి జరిగే సమయానికి లక్ష్మిపై కొందరు అత్యాచారం చేస్తారు. అడ్డుకున్న శ్రీను కూడా చంపేస్తారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై మూసేసిన ఈ కేసుపై డాక్యుమెంటరీలు తీసుకునే యువకుడు భగత్ పోరాటం మొదలుపెడతాడు. అమాయకులపై జరిగిన ఘోరాలకు ఎమ్మెల్యే వైసీ రావు (అజయ్ ఘోష్ ) ఉన్న సంబంధం ఏంటి? ఈ గ్యాంగ్ పై భగత్ (విదార్థ్) చేసిన న్యాయపోరాటం ఫలించిందా? లేదా? భగత్ పోరాటానికి అనన్య (దృవీక) ఎలా హెల్ప్ చేసింది అనేదే ‘భగత్ సింగ్ నగర్’మూవీ మిగతా కథ.
ఎలా చేశారంటే..?
శ్రీను, భగత్ అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన విదార్థ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. శ్రీనుగా స్లమ్ బాయ్ గా సహజంగా కనిపించిన విదార్థ్...డాక్యుమెంటరీ మేకర్ గా సిటీ కుర్రాడిగా మారిపోయాడు. క్లాస్, మాస్ కారెక్టర్స్‌లో బాగానే కనిపించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. చూడడానికి తమిళ హీరోలా ఉన్నప్పటికీ.. పక్కా తెలుగింటి కుర్రాడు విదార్థ్. భవిష్యత్తులో హీరోగా రాణించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఇక లక్ష్మి, అనన్య పాత్రల్లో దృవీక కూడా అటు సంప్రదాయంగా, ఇటు మోడరన్ గా నటించి మెప్పించింది. ఎమ్మెల్యే సీవీఆర్ పాత్రలో అజయ్ ఘోష్ ఒదిగిపోయాడు. నెగెటీవ్ షేడ్స్ ఉన్న ఎస్‌ఐ క్యారెక్టర్‌లో బెనర్జీ తన అనుభవాన్ని చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఎలా ఉందంటే...?
భగత్ సింగ్ నగర్‌లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథే భగత్ సింగ్ నగర్. సినిమా టైటిల్స్ లోనే దేశ భక్తుల ఫొటోలు, అన్యాయాలపై పోరాటం చేసిన ధీరుల చిత్రాలను చూపించారు. తప్పు జరిగితే తిరగబడాలనే స్ఫూర్తిని సినిమా ఆరంభం నుంచే కలిగించారు దర్శకుడు వాలాజ క్రాంతి. ఉన్నంతలో సినిమాను బాగా చేయడానికి తమ వంతు కృషి చేసారు. సొసైటీ మారాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలనే ఆలోచన రేకెత్తించారు. భగత్ సింగ్ నగర్ లో జరిగే అన్యాయాలపై శ్రీను తిరగబడటం చూస్తే ఇదే ఇన్స్ పిరేషన్ కలుగుతుంది. తన చుట్టూ ఉన్న వాళ్లు మారాలంటే ముందు మార్పు తనలో రావాలనే మద్యపానం మానేస్తాడు శ్రీను. తన వాడలో ఎవరు మహిళలను కించపరిచినా వారికి తగిన బుద్ధి చెబుతాడు. ఇలా హీరోయిజంతో సినిమా సాగుతూనే, శ్రీను లక్ష్మిల మధ్య క్యూట్ లవ్ స్టోరీ చూపించారు దర్శకుడు క్రాంతి. అయితే కొన్ని ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా లేకపోవడం సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. ప్రభాకర్ దమ్ముగారి సంగీతం పర్వాలేదు. రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియదు కానీ.. ఓ మంచి సందేశాత్మక చిత్రమవుతుందని చెప్పొచ్చు.