
కాదేదీ బిగ్‌బాస్ టాస్క్‌కు అనర్హం అన్నట్లుగా ఉంది ప్రస్తుత సీజన్ పరిస్థితి. కెప్టెన్ పోటీకి ఏ ఆటా దొరకనట్టు కింద మంట, పైన ఐస్‌గడ్డ పట్టుకోమని ఓ రకంగా కంటెస్టెంట్లను చిత్రహింసలు పెట్టారు. ఇది చూసి కెప్టెన్సీ పోటీలో నిలబడలేనివారు బతికిపోయారాం దేవుడా అని గాఢంగా నిట్టూర్పు వదిలారు. కానీ ఆ నరకాన్ని తట్టుకుని మరీ సోహైల్ కెప్టెన్‌గా విజయం సాధించడం విశేషమనే చెప్పాలి. ఇక ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో చేతబడి జరుగుతోంది. నమ్మశక్యంగా లేదు కదూ.. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోను చూడండి. అందులో బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ అవతారంలో ఉన్న అవినాష్‌ను అందరూ ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఏమైనా కుప్పిగంతులు వేస్తారేమోననుకుంటే పొరపాటే. (చదవండి: అతడు నాకు అస్సలు నచ్చడు: స‌్వాతి దీక్షిత్)
అందరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని "బిగ్‌బాస్ ఆవాహయామి" అంటూ పిలుస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అవినాష్‌కు బిగ్‌బాస్ పూనాడు. అంతే.. అప్పటికే తెగ ఉవ్విళ్లూరుతున్న హారిక ఏదో ప్రశ్న అడగబోతూ ఇంగ్లీష్‌లో మాట్లాడటంతో తెలుగులో మాట్లాడమని అవినాష్ కౌంటర్ వేశాడు. బిగ్‌బాస్‌ను ఇమిటేట్ చేసిన అవినాష్ అబ్బాయిలకు పంచ్‌లు విసిరాడు కానీ మిగతా అమ్మాయిల విషయానికి వచ్చేసరికి బోల్తా కొట్టాడు. వాళ్లు ఐ లవ్ యూ అంటూ గాల్లోనే ముద్దులు పంపిస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రేమ పాటలు వేసుకుంటూ వేరే లోకంలో మునిగిపోయాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు షోలో ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గగానే వెంటనే అవినాష్‌ను హైలెట్ చేస్తారంటున్నారు. ఈ ఒక్క టాస్క్ గత సీజన్ల నుంచి కాపీ కొట్టకుండా, కొత్తగా ఆలోచించారని ప్రశంసిస్తున్నారు. (చదవండి: అఖిల్ పడుకున్నాక అభితో మోనాల్ ముచ్చట్లు!)