
ఆయన గొంతు వింటే నెమళ్లు కూడా పరవశంతో పురివిప్పి నాట్యమాడుతాయి. స్వరం సవరించుకున్నారంటే శ్రోతలు చెవులు రిక్కిరించీ మరీ పాటల తోటలో ఊయలలూగుతారు. ఆయన గొంతు నుంచి జాలువారిన స్వరాలు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను ఉర్రూతలూగించాయి. ఆయనే.. గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఈ లోకం నుంచి నిష్క్రమించారన్న వార్త సినీ ప్రపంచాన్ని, అభిమానులను తీవ్ర విషాదంలోనికి నెట్టింది. కానీ బాలు ఇక లేరన్న విషయం బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకు ఇప్పటివరకు తెలియనేలేదు. (‘అప్పదాసు’గా ఎప్పటికి జీవించి ఉంటావు..)
దీంతో నేటి ఎపిసోడ్‌లో ఈ బాధాకరమైన విషయాన్ని తెలియజేసేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. నేటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరి చేతా బాలుకు నివాళులర్పించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఎస్పీ బాలు చిత్రానికి నాగార్జున మనస్ఫూర్తిగా నమస్కరించారు. "ఆ స్వరం ఇక పలకదని, ఆ వరం మనకిక లేదని సరిగమలు కన్నీళ్లు పెట్టాయి. రాగాలన్నీ బాధపడ్డాయి. దాచుకో స్వామి.. దాచుకో, మా బాలును జాగ్రత్తగా దాచుకో" అంటూ నాగ్ ఉద్వేగభరితులయ్యారు. (బిగ్‌బాస్: గంగవ్వకు అతడిష్టం, ఆమె కష్టం)