బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో ప్రేక్షకులు అతి చేసేవాళ్లను మెచ్చడం లేదు. ఇంటి సభ్యులందరినీ నోరెత్తకుండా, తన మాటే వేదంలా ఆచరించాలనేట్టు అతిగా ప్రవర్తించిన దర్శకుడు సూర్య కిరణ్‌ను మొదటి వారంలోనే బయటకు వెళ్లగొట్టారు. తర్వాత ఓవర్ ఎమోషన్స్ అంటే.. అప్పుడే అందరి మీదా అరిచేసి, ఆ వెంటనే ఏదో జరిగిపోయినట్లు ఏడ్చేసిన కరాటే కల్యాణిని కూడా వీక్షకులు తప్పు పట్టారు. దీంతో రెండోవారంలో ఆమెను ఇంటికి సాగనంపారు. ఇప్పుడు మూడో వారం ముగింపుకు వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఓ కంటెస్టెంటు ముల్లెమూట సర్దుకోనున్నారు. అది ఎవరనేది ఇప్పుడు చూసేద్దాం..
లాస్య, హారికకు ఇప్పట్లో ముప్పు లేదు
ఈ వారం నామినేషన్‌లో లాస్య, కుమార్ సాయి, దేవి నాగవల్లి, మెహబూబ్, అరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, హారిక ఉన్నారు. ఈ అందరిలో పాపులారిటీ ఎక్కువగా ఉన్న లాస్య ఇప్పట్లో బయటకు వెళ్లే ఛాన్సే లేదు. ఇప్పుడిప్పుడే తెలుగు కూడా మాట్లాడుతోన్న హారిక గేమ్‌పై ఫోకస్ పెట్టింది. ఆమెకు చాలానే ఓట్లు గుద్దడంతో సేఫ్ జోన్‌లో ఉంది. దేవి నాగవల్లి ఎవరి మాటలకు లొంగకుండా, గేమ్‌ను తన పంథాలో ఆడుతోంది. ఈ వారానికైతే ఆమె కూడా డేంజర్ జోన్‌లో లేదు. కుమార్ సాయి.. నిజానికి వచ్చిన వారానికే వెళ్లిపోతాడనుకున్నారు. ఈ విషయాన్ని ప్రేక్షకుల కన్నా ఎక్కువగా ఇంటి సభ్యులే బలంగా నమ్మారు. కానీ అలా జరగలేదు. (చెరసాలలో చెత్తగా ఆడిన నోయల్!)
ఇంటి సభ్యుల వల్లే కుమార్‌కు ఓట్లు
పైగా అతడికి వేసే ఓట్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కారణం అతని ఆడే తీరు నచ్చి కాదు. ఇతర కంటెస్టెంట్లు అతనితో ప్రవర్తించే విధానం. బిగ్‌బాస్‌లో అందరూ కుమార్‌ను గడ్డి పోచతో చూస్తూ, అతడికి మాట్లాడే చాన్స్ కూడా ఇవ్వడం లేదు. అందరూ ఏకమై అతన్నే టార్గెట్ చేస్తున్నారు. టీవీల ముందు కూర్చుని అంతా గమనిస్తున్న ప్రేక్షకులు కుమార్‌కు జరుగుతున్న అవమానానికి ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలనుకున్నారు. దీంతో అతడికి అత్యధిక స్థాయిలో ఓట్లు వస్తున్నాయి. మిగిలింది అరియానా, మెహబూబ్.. వీరిద్దరే ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్నారు. (బిగ్‌బాస్: ఏడుగురిలో ఇంటికెళ్లేది ఎవరు?)
ఫిజికల్ టాస్క్‌తో మెహబూబ్‌కు దెబ్బ
అరియానా సీక్రెట్ రూమ్‌లో నుంచి ఇంట్లో అడుగు పెట్టిన రోజు చాలా ఓవర్ చేసిందని ప్రేక్షకులే కాదు హౌస్‌మేట్స్ కూడా అన్నారు. కానీ ఈ మధ్య అలాంటి వేషాలేం వేయడం లేదు. పైగా తాజా ఫిజికల్ టాస్క్‌లోనూ ఎవరి మాటలను పట్టించుకోకుండా, తనను డిస్కరేజ్ చేసినా సరే 'పోరాడి ఓడిపోవడం నాకిష్టం' అని ఓమాట చెప్పింది. దీంతో ఆమెకు ఓట్లు వేయని జనాలు కూడా అరియానాను 'ఫైటర్'గా అభివర్ణిస్తూ ఆమె ఇంట్లో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. టాస్క్‌లంటే చాలు తన ప్రతాపం చూపించే మెహబూబ్ ఈ వారంలో తన పేరు తానే చెడగొట్టుకున్నాడు. దివి కిడ్నాప్ అయినప్పుడు లోపల ఎలాంటి హింస జరగకపోయినా సినిమా డైలాగులు చెప్పి, కన్నీళ్లు కార్చేసి బకరా అయ్యాడు. ఇక్కడ మెహబూబ్ అతి చేశాడని చాలామంది కామెంట్లు చేశారు. ఈ వారం మెహబూబ్‌కు తక్కువ ఓట్లు రావడంతో అతడు ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment