
ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ అవగా అందులో ఆరుగురు అమ్మాయిలే కావడం గమనార్హం. ప్రస్తుతం హౌస్‌లో లేడీ కంటెస్టెంట్లు యానీ మాస్టర్, ప్రియాంక సింగ్, కాజల్, సిరి మాత్రమే మిగిలారు. వీళ్లలో యానీ మాస్టర్ ప్రతివారం తనకు స్ట్రాంగ్ అనిపించినవాళ్లను నామినేట్ చేస్తూ వస్తోంది. ఆటలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఇక కాజల్.. మాటకు ముందూవెనకా స్ట్రాటజీ అనే పదం తీయకుండా ఉండదు. ఆటలోనూ స్ట్రాటజీ ప్లే చేశానని చెప్తూ ఉంటుంది. సిరి.. షణ్ముఖ్‌తో దోస్తీతో బాగానే స్క్రీన్ స్పేస్ దక్కించుకుంటోంది. అలాగే ఆటలోనూ మిగతావారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది.
మిగిలిందల్లా ప్రియాంక సింగ్.. జీవితాన్ని కాచి వడబోసింది. ఇంటాబయట ఎన్నో సమస్యలను ఎదుర్కొని, వాటన్నింటినీ సమర్థవంతంగా దాటుకుని ఇక్కడిదాకా వచ్చింది. తన జీవితం ఎంతోమంది ట్రాన్స్‌జెండర్లకు మార్గదర్శకంలాంటిది. కానీ ఆమె బిగ్‌బాస్ షోను సరిగా వినియోగించుకోలేకపోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిగ్‌బాస్ షోలో ఆమె గురి.. ట్రోఫీ, టాప్ 5పై కాకుండా కేవలం మానస్ మీదే ఉంది. ఎంతసేపూ అతడి కోసమే ఆలోచిస్తూ, అతడి గురించే కబుర్లు చెప్తూ, అతడిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఆ మధ్య ఓ టాస్క్‌లో మానస్‌ను పెళ్లాడేసి గాల్లో తేలిపోయింది.
రానురానూ ఆమెకు మానస్ మీదే ప్రేమ పెరుగుతుందే తప్ప రవ్వంతైనా తగ్గడం లేదు. ఇది ఆమె గేమ్‌ను దెబ్బ తీస్తోంది. గేమ్‌ల మీద పెద్దగా దృష్టి సారించలేకపోతుంది. మొన్నామధ్య బంగారు కోడిపెట్ట టాస్కులోనూ మానస్ గుడ్లకు రక్షణగా ఉంటూ తన గేమ్ పక్కనపెట్టేసింది. రంగు పడుద్ది టాస్కులోనూ ప్రియాంక గెలుస్తుందని అంతా అనుకుంటే అనూహ్యంగా యానీ విజయాన్ని అందుకుంది. ఇక మానస్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతడికి కుంకుమ పెట్టడం, రెప్ప వాల్చకుండా అతడినే చూస్తూ తనను తాను మైమరిచిపోవడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా పింకీ మరోసారి మానస్ మీద ప్రేమను చాటుకుంది. బిగ్‌బాస్ అన్‌సీన్ వీడియోలో హౌస్‌మేట్స్ ఆరుబయట నిద్రించారు. తెల్లవారుతుండే సమయంలో మెలకువ వచ్చిన పింకీ మానస్‌కు ఎండ తగులుతోందని గ్రహించింది. వెంటనే అక్కడున్న దిండును అడ్డుపెట్టి ముఖానికి ఎంత తగలనీయకుండా జాగ్రత్త పడింది. తరువాత స్కార్ఫ్‌లాంటిది ఒకటి పట్టుకుని ఎండ నుంచి రక్షిస్తూ అక్కడే కూర్చుంది. అయితే ఇలా ఎంతసేపు ఉండాలో, ఏమో అనుకుందో ఏమో కానీ వెంటనే బట్టలు ఆరేసుకోవడానికి వినియోగించే స్టాండ్‌ను తీసుకొచ్చి మానస్ కాళ్ల దగ్గర పెట్టింది. అప్పుడుకానీ అతడికి ఎండ తగలట్లేదని అర్థమైన పింకీ హమ్మయ్య అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ కేరింగ్ చూసిన నెటిజన్లు కొందరు పాపం పింకీ, ఎంతలా ప్రేమిస్తుందో అని కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం.. 'మానస్‌ను వదిలేయ్, తన గేమ్ తనను ఆడనివ్వు', 'ఈమె మానస్ కోసమే బిగ్‌బాస్‌కు వచ్చిందా?' అంటూ ఫైర్ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment